తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 24వ రోజుకు చేరుకుంది. భవిష్యత్తు కార్యాచరణ నేపథ్యంలో ఇవాళ ఆర్టీసీ జేఏసీ కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కలెక్టరేట్ల ముట్టడికి కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని క్యాడర్‌కు ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని కార్మికులు అంటున్నారు. 45 డిమాండ్లపై చర్చకు సిద్ధమంటూ ఆర్టీసీ ఎండీకి జేఏసీ నేతలు లేఖ రాశారు. మరో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలను వేగవంతం చేస్తోంది. ఆర్టీసీ అద్దె బస్సులకు మరిన్ని నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ప్రైవేట్‌ రూట్లపై సర్వే నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇప్పటికే 924 బస్సులతో ఒప్పందం పూర్తి చేసుకుంది. మరో వెయ్యి బస్సులకు తర్వలో నోటిఫికేషన్‌ వెలువడనుంది.

మరో వైపు ఇవాళ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు సూచనతో 26న కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు విఫలం కావడంతో మళ్లీ సమ్మె మొదటికి వచ్చింది. ఆర్టీసీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. హైకోర్టు విచారణ నేపథ్యంలో ఆర్టీసీ నేతలతో జరిపిన చర్చల నివేదికను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించనుంది. కార్మికులే చర్చ మధ్యలో వెళ్లిపోయారని ప్రభుత్వం కోర్టుకు తెలపనుంది. అయితే ఆర్టీసీ నేతలతో చర్చల సమావేశాన్ని అధికారులు వీడియో రికార్డు చేశారు. చర్చలు విఫలం కావడంతో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 2.30కి హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ జరగనుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.