బ్రేకింగ్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Nov 2019 5:48 PM ISTతెలంగాణ ఆర్టీసీ ఏజేసీ మళ్లీ వెనక్కి తగ్గింది. తమ డిమాండ్ల సాధన కోసం గత 50 రోజులకుపైగా పోరాడుతున్న ఆర్టీసీ కార్మికులు ఎట్టకేలకు సమ్మె విరమించారు. సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. రేపు కార్మికులందరూ విధులకు హాజరు కావాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి పేర్కొన్నారు. సెకండ్ షిప్టు వాళ్లుకూడా విధులకు హాజరు కావాలని అన్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరు కావొద్దన్నారు. రేపు ఉదయం ఆరు గంటలకు విధులకు హాజరై యాజమాన్యంపై ఒత్తిడి తేవాలని, కార్మికులు ఓడిపోలేదు...ప్రభుత్వం గెలవలేదన్నారు. మృతి చెందిన కార్మిక కుటుంబాలకు ఆర్టీసీ జేఏసీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
52 రోజుల పాటు పోరాటం చేశాం..
తమ డిమాండ్ల సాధన కోసం 52 రోజుల సుదీర్ఘ పోరాటం చేశామని, ఎన్ని నిర్భంధాలు చేసినా సమ్మెలో భాగంగా చేసిన పోరాటాలను విజయవంతం చేశామని అశ్వత్ధామరెడ్డి అన్నారు. తమ డిమాండ్ల కోసం ఇంత పోరాడినా..ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి సంస్థ ను నిర్వీర్యం చేసిందని ఆయన దుయ్యబట్టారు. దేశంలో దొంగలు పడ్డట్టు.. ఆర్టీసీ ఆస్తులను నిర్వీర్యం చేశారని, కొంతమంది అధికారులు ఆర్టీసీ ని అమ్ముకునే ప్రయత్నం చేశారని, నైతిక విజయం మనదేనిన అన్నారు. కార్మికులు ఓడిపోలేదు.. ప్రభుత్వం గెలవలేదు...దశలవారి పోరాటం కొనసాగుతోందన్నారు.