తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణలోఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఎట్టకేలకు ఫలితం లభించింది. ఇన్ని రోజుల పాటు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీపి కబురు వినిపించారు. గురువారం కేబినెట్‌ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్న కేసీఆర్‌, అనంతరం మీడియాతో మాట్లాడారు. రేపటి నుంచి కార్మికులు విధుల్లోచేరాలని పిలుపునిచ్చారు. సమ్మె కాలంలో ఆర్టీసీ కోసం బస్సులు నడిపి, నిర్వహణ సేవలందించిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుంటామని కేసీఆర్‌ అన్నారు. ఆర్టీసీకి వంద కోట్ల రూపాయల వరకు కేటాయిస్తున్నామని అన్నారు. కేసీఆర్‌ ప్రకటనతో వేలాది మంది ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలకు ఊరట లభించినట్లయింది.

తాము పేదల ప్రయోజనం కోరుకుంటామే తప్ప.. వారి పొట్టకొట్టమని కేసీఆర్‌ వ్యాఖ్యనించారు. ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాటలు నమ్మి దెబ్బతిన్నారని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. వారి సమ్మె అసంబద్ధమైనదన్నారు. వాస్తవానికి ఆర్టీసీ కార్మికుల విషయంలో వారిని తప్పుదారి పట్టించింది యూనియన్లు, ప్రతిపక్షాలేనని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించేందుకు కొందరు ప్రలోభాలు పెడుతున్నారని, ఢిల్లీకి వెళ్లిన ప్రతిపక్షాలు..కార్మికులకు ఏదో చేస్తామని ఆశలు చూపారన్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్