తెలంగాణ ఆర్టీఏ కీలక నిర్ణయం.. ఇక ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లకుండానే ఇంట్లో నుంచే సేవలు
By సుభాష్ Published on 4 Jun 2020 3:39 PM ISTముఖ్యాంశాలు
డ్రైవింగ్ లైసెన్స్, వాహన లైసెన్స్, లెర్నింగ్ అన్ని మొబైల్ నుంచే..
17 రకాల సేవలు అందుబాటులో
తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ రవాణాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభిస్తున్న వేళ.. కొత్తవిధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ఇప్పటివరకూ వాహనాలకు సంబంధించి ఏ చిన్న పని ఉన్నా.. ఆర్టీసీ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఇకపై అలాంటిదేమి ఉండకుండా ఇంటి నుంచి పని చేసుకోవచ్చు. నేరుగా సేవలుపొందవచ్చు. ఇందుకు ఆర్టీఏ ప్రణాళికలను రూపొందించింది. వారం రోజుల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇక డ్రైవింగ్ లైసెన్స్ , లెర్నింగ్ లైసెన్స్ , వాహన కొనుగోలు, అమ్మకాలు ఇలా అన్నింటికీ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు అలాంటిదేమి ఉండదు. వాహనదారుడు మొబైల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
సంబంధిత డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లోనే ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే డాక్యుమెంట్లతోపాటు వినియోగదారుడు సెల్ఫీ, డిజిటల్ సంతకాన్ని కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫీజు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. వివరాలన్ని ఆర్టీఏ అధికారులు పరిశీలించి స్మార్ట్ కార్డులను స్పీడ్ పోస్టు ద్వారా చిరునామాకు పంపిస్తారు. అయితే స్వయంగా రావాల్సిన సేవలు మినహాయించి, మిగతా 17 రకాల సేవలను ఆన్‌లైన్ ద్వారానే వినియోగించుకోవచ్చని అధికారులు వెల్లడించారు. అలాగే దరఖాస్తు చేసుకున్న వారికి ఎస్‌ఎంఎస్ ద్వారా వినియోగదారులు కోరుకున్న సేవలను ధృవీకరిస్తూ ఒక నెంబర్‌ను కేటాయిస్తారు. ఆర్టీఏ ఆన్‌లైన్‌లో లోపం జరిగినా, ఆలస్యమైనా,సాంకేతిక సమస్య తలెత్తినా ఇలా ఎన్నో కేటాయించిన నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. కాగా, ఎవరైనా కార్యాలయానికి రావాల్సి ఉంటే.. మాస్క్ ధరించడం, భౌతిక దూరం తప్పనిసరి అని అధికారులు వెల్లడించారు.
మొత్తం 17 రకాల సేవలు అందుబాటులో..
డ్రైవింగ్ లైసెన్స్, రెన్యూవల్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, లెర్నింగ్ లైసెన్స్ , కాలపరిమితి పెంపు, లెర్నింగ్ లైసెన్స్ లో ఒకటికంటే ఎక్కువ వాహనాలకు అనుమతి కోరడం, వాహనాల రిజిస్ట్రేషన్, వివిధ రకాల డాక్యుమెంట్ల చిరునామాలో మార్పు, చేర్పులు, రవాణా వాహనాల పర్మిట్లు తదితర ఇలా 17 రకాల సేవలను తెలంగాణ ఆర్టీఏ మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకున్నారు.