కరిగిన కోటలు, ఒరిగిన నేతలు

By రాణి  Published on  29 Jan 2020 5:20 AM GMT
కరిగిన కోటలు, ఒరిగిన నేతలు

కాంగ్రెస్ పార్టీది విచిత్రమైన పరిస్థితి. పార్టీ ఈ రోజు తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో రెండో స్థానంలో ఉంది. మొత్తం మీద టీఆర్ ఎస్ తరువాత స్థానం దానిదే. కానీ దాదాపు కాంగ్రెస్ నేతలందరూ తమ తమ కంచుకోటల్లోనే కుదేలైపోయారు. కాంగ్రెస్ రామగుండం, బండ్లగుడా జాగీర్, బోడుప్పల్, పీర్జాదిగుడా, జవహర్ నగర్ వంటి చోట్ల రెండో స్థానంలో నిలిచింది. కామారెడ్డి, భోన్గిర్, నల్గొండ, సూర్యాపేట్, సంగారెడ్డి, జనగామ, కల్వకుర్తి, కొసిగి మునిసిపాల్టీల్లో గట్టి పోటీని ఇచ్చింది.

కానీ పేరు మోసిన కాంగ్రెస్ దిగ్గజాలు మాత్రం దయనీయమైన ఓటమి పాలయ్యారు. సొంత కోటల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకలేకోపోయారు..పార్టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన అభేద్య దుర్గాల్లాంటి హూజూర్ నగర్, కోదాడలను కోల్పోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడను కోల్పోయారు. తరువాత లోకసభకు గెలిచి హుజూర్ నగర్ అసెంబ్లీ సీటును రెండో సారి కోల్పోయారు. ఇప్పుడు మునిసిపల్ ఓటములతో ముచ్చటగా మూడో సారి ఓడిపోయారు. ఇక ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొడంగల్ లో తొక్కని వీధి లేదు. ఎక్కని గడప లేదు. కానీ ఆఖరికి ఓట్లు లెక్కించే సరికి ఆయన నీరసించిపోయారు. మూడంటే మూడు వార్డులే కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. మిగతా సీట్లన్నీ గులాబీ రంగు పులుముకున్నాయి. సీ ఎల్ పీ నేత మల్లు భట్టివిక్రమార్క కంచుకోట మథిర కథ కూడా ఇంతే. కాంగ్రెస్ నాలుగు సీట్లతో సరిపుచ్చుకోగా, టీఆర్ ఎస్ పదకొండు స్థానాలు గెలుచుకుంది.

ఇక సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేటల్లో మంత్రి హరీశ్ పాచికలు పారాయి. రెండింటికి రెండూ గులాబీ ఖాతాలో పడ్డాయి. పీసీసీ చీఫ్ పదవి నాకుకావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి మొండి చెయ్యే దక్కింది. ఈ మొత్తం పోరాటంలో పరువు దక్కించుకున్న ఒకే ఒక్క కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ మున్సిపాలిటీలో ఆయన ప్రయత్నాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇరవై సీట్లు గెలుచుకుంది. టీఆర్ ఎస్ కి కూడా 20 సీట్లే వచ్చాయి. కోమటిరెడ్డి కృషి వల్ల కాంగ్రెస్ నల్గొండ జిల్లాలోని చిట్యాల, చౌటుప్పల్, భోన్ గిర్ లలో గణనీయమైన సీట్లను సాధించింది.

ఈ ఫలితాలే కొలమానమైతే, కోమటిరెడ్డికి మాత్రమే పీసీసీ చీఫ్ పీఠం దక్కాలి. ఎన్నికల స్వయంవరంలో కోమటిరెడ్డి మాత్రమే తన సత్తా చాటాడు. మరి అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Next Story