తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఎన్నికలు.. కోర్టుకెళ్తానంటున్న జగన్మోహన్‌రావు..

By అంజి  Published on  10 Feb 2020 4:57 AM GMT
తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఎన్నికలు.. కోర్టుకెళ్తానంటున్న జగన్మోహన్‌రావు..

తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో జయేశ్‌ రంజన్‌ ఘన విజయం సాధించారు. తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ఎన్నికయ్యారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో కొద్ది రోజులుగా వార్తల్లో నిలిచిన టీఓఏ ఎన్నికలు మొత్తానికి ముగిశాయి.

ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్‌ భవన్‌లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 84 ఓట్లకు గాను జయేష్‌ రంజన్‌కు 46 ఓట్లు, ప్రత్యర్థి రంగారావుకు 33 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 81 ఓట్లు పోలవగా.. రెండు ఓట్లు చెల్లలేదు. 46 ఓట్లతో జయేష్‌ రంజన్‌ గెలవడంతో ప్యానెల్‌ సభ్యులు స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు.

వైస్‌ ప్రెసెడింట్‌లుగా జయేష్‌ రంజన్‌ ప్యానెల్‌ నుంచి మహ్మద్‌ అలీ, ప్రేమ్‌రాజ్‌, రంగారావు ప్యానెల్‌ నుంచి సరల్‌ తల్వార్‌, వేణుగోపాలాచారి దక్కించుకున్నారు. కోశాధికారిగా మహేశ్వర్‌ 15 ఓట్ల తేడాతో పాణిరావుపై గెలిచారు. నాలుగు సహాయ కార్యదర్శి పదవులకు గాను మూడు రంగారావు వర్గం గెల్చుకోగా, ఒకటి జయేష్‌ వర్గం గెల్చింది. టగ్‌ ఆఫ్‌ వార్‌లా సెక్రటరీ ఎన్నిక సాగింది. రెండు ఓట్ల తేడాతో జగదీశ్వర్‌ యాదవ్‌ గెలిచారు.

జయేష్‌ రంజన్‌ ప్యానెల్‌కు చెందిన జగన్మోహన్‌రావు ఓటమి పాలయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్‌రావు మాట్లాడుతూ.. నైతిక విజయం తనదేనన్నారు. 30 సంఘాలను ఐఓఏ ముందు ఓటు హక్కు ఇచ్చారని.. ఆ తర్వాత 42కు పెంచారని ఆయన అన్నారు. దీనిపై రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు వ్యతిరేకంగా ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేస్తానని జగన్మోహన్‌రావు అన్నారు. ఒకరికి బదులు మరొకరు ఓటు వేశారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై కోర్టుకు వెళ్తానని ఆయన వ్యాఖ్యనించారు. త్వరలోనే మళ్లీ ఎన్నికలు జరుగుతాయని జగన్మోహన్‌ రావు అన్నారు.

Next Story