తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల హైడ్రామా

By అంజి
Published on : 3 Feb 2020 4:47 PM IST

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల హైడ్రామా

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్‌ ఎన్నికలపై బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి స్పందించారు. అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదని, ఇదివరకే ఒకసారి రాష్ట్ర ఒలంపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పని చేశానని తెలిపారు. జయేష్‌ రంజన్‌ నామినేషన్‌ వేశాడు కాబట్టే.. తాను రంగంలోకి దిగానని తెలిపారు. జయేష్‌ రంజన్‌ నామినేషన్‌ తిరస్కరణకు కారణం చెప్పట్లేదనటం అబద్దమని ఆయన పేర్కొన్నారు.

నామినేషన్‌ తిరస్కరణకు కారణాలను రిటర్నింగ్‌ అధికారి మెయిల్‌ రూపంలో ఇచ్చారని జితేందర్‌రెడ్డి తెలిపారు. అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే ఏదో ఒక అసోసియేషన్‌లో ఈసీ సభ్యుడై ఉండాలన్నారు. జయేష్‌ రంజన్‌ ఏ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌లో అసలు మెంబరే కాదన్నారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్‌ నడపడానికి ఏడాదికి రూ.30 లక్షలు కావాలన్నారు. ఢిల్లీలో ఎన్నికలు జరగడానికి ఎజీఎమ్‌ మీటింగ్‌లో అందరూ అంగీకరించారని తెలిపారు.

ఈ నెల 9న తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి రాజకీయంగా హైడ్రామా సాగుతోంది. ఎన్నికలను అడ్డుకొని తీరుతామని జయేశ్‌ రంజన్‌ ప్యానల్‌ చెప్తోంది. ఎన్నికల అధికారిగా చంద్రకుమార్‌ నియామకం చెల్లదని జయేశ్‌ వర్గం ఆరోపిస్తోంది. జయేశ్ రంజన్‌ నామినేషన్‌ తిరస్కరించటం అనైతికమని హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ జగన్‌మోహన్‌రావు అన్నారు. తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఎన్నికలు హైదరాబాద్‌లోనే జరుగుతాయని వివరించారు.

Next Story