కమిషనర్‌ గారు నాకో రివాల్వర్‌ ఇవ్వండి.. ఈ మృగాళ్ల మధ్య భయమేస్తోంది..!

By అంజి  Published on  1 Dec 2019 9:00 AM GMT
కమిషనర్‌ గారు నాకో రివాల్వర్‌ ఇవ్వండి.. ఈ మృగాళ్ల మధ్య భయమేస్తోంది..!

ముఖ్యాంశాలు

  • లైసెన్స్‌ రివాల్వర్‌ ఇవ్వాలని వరంగల్‌ సీపీకి మహిళ లేఖ
  • బయటికి వెళ్లాలంటే భయంగా ఉంది: మహిళా ఉద్యోగిని
  • ఆయుధాల చట్టం-1959 ప్రకారం రివాల్వర్‌ ఇవ్వాలని విజ్ఞప్తి

తెలంగాణలో రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. మహిళలు బయటికి రావాలంటేను వణికిపోతున్నారు. రోడ్డుపై మహిళలు ఒంటరిగా నడవాలంటే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిర్భయ, అభయ లాంటి కఠినమైన చట్టాలు తీసుకువచ్చినా అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఆగట్లేదు. తాజాగా హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్‌ , వరంగల్‌లో ఓ యువతి హత్య ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. నిందితులకు కఠిన శిక్షలు విధించాలని ప్రజలు, మహిళలు, ప్రముఖులు డిమాండ్‌ చేస్తున్నారు.

మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఓ మహిళా ఉద్యోగిని తనకు లైసెన్స్‌ రివాల్వర్‌ ఇవ్వాలని వరంగల్‌ కమీషనరేట్‌కు లేఖ రాసింది. భయం గుప్పిట బతుకుతున్న నాలాంటి మహిళలకు ఓ ఆయుధం సమకూర్చి.. అండగా నిలవాలంటూ కమిషనర్‌ను అభ్యర్థించింది. తాజాగా అమ్మాయిల పట్ల జరిగిన ఘటనలు తనను భయాందోళనకు గురి చేస్తున్నాయని.. ఆత్మరక్షణ కోసం తనకు రివాల్వర్‌ మంజూరు చేయాల్సిందిగా వరంగల్‌ కమీషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ను కోరింది. ఈ మేరకు మహిళ ఉద్యోగిని ఈ మెయిల్‌ ద్వారా కమిషనర్‌ కార్యాలయానికి లేఖ రాసింది. ఆయుధాల చట్టం-1959 ప్రకారం రివాల్వర్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. తాను రోజు ఉద్యోగం నిమిత్తం వరంగల్‌ నుంచి ఖమ్మంకు ఒంటరిగా ప్రయాణం చేస్తానని, ఉదయం వెళితే.. తిరిగి వచ్చేసరికి రాత్రి అవుతోందని లేఖలే పేర్కొంది. తాజాగా జరిగిన ఘటనల నేపథ్యంలో ఇంటికి క్షేమంగా తిరిగి వస్తానన్న భయం రోజు వెంటాడుతోందని పేర్కొంది.

వరంగల్‌లో జరిగిన యువతి హత్య ఘటన తమ ఇంటికి సమీపంలోనే చోటు చేసుకుందని తెలిపింది. ఎమర్జెన్సీ సమయంలో 100కు డయల్‌ చేసిన, యాప్‌ ద్వారా పోలీసులు సాయం కోరినా.. క్షణాల్లోనే తమను రక్షిస్తారని నాకు ఏంత మాత్రం నమ్మకం లేదని మహిళా ఉద్యోగిని తన లేఖలో తెలిపింది. పోలీసింగ్‌లో అత్యుత్తమ టెక్నాలజీ కలిగిన దేశాలైన కెనెడా, నెదర్లాండ్స్‌, ఇంగ్లాండ్‌లో కూడా సరిగా అమలు కావడం లేదని.. అలాంటింది చిన్నపాటి వరంగల్‌ నగరంలో అది సాధ్యమవుతుందని అనుకోవడం అత్యాశ కిందికే వస్తుందని సదరు మహిళ ఉద్యోగిని తన లేఖలో తెలిపింది. అయితే పోలీసులపై నమ్మకం లేదని అనడం లేదని తెలిపింది. మానవ మృగాల మధ్య తిరగాలంటే రివాల్వర్‌ ఉంటేనే సురక్షితమని నేను నమ్ముతున్నానని.. ఒకవేళ మీరు నాకు రివాల్వర్‌ ఇవ్వకపోతే ఉద్యోగం మానేయాల్సి వస్తుందని మహిళా తన లేఖలో పేర్కొంది. దీనిపై సీపీ విశ్వనాథ్ రవీందర్‌ను వివరణ కోరగా తమకు ఈ మెయిల్‌ లేఖ వచ్చిందని తెలిపారు.

Next Story