తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపుకు రంగం సిద్ధం..!
By అంజి Published on 2 Dec 2019 3:45 PM ISTహైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంది. అలాగే ఆర్టీసీ బస్సు చార్జీలు కూడా కిలోమీటర్‌కు 20 పైసలు చొప్పున పెంచుతామని సీఎం కేసీఆర్ అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపుకు రంగం సిద్ధమైంది. ఇవాళ అర్థరాత్రి నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి. పల్లె వెలుగు బస్సులో కనీస చార్జి రూ.5 నుంచి రూ.10కి పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెమీ ఎక్స్‌ప్రెస్ కనీస్ ఛార్జీ రూ.10గా నిర్ణయించారు. అలాగే ఎక్స్‌ప్రెస్ కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.15కి, డీలక్స్ కనీస ఛార్జీ రూ.15 నుంచి రూ.20కి, సూపర్ లగ్జరీలో కనీస ఛార్జీ రూ.25, రాజధాని, వజ్ర బస్సుల్లో కనీస ఛార్జీ రూ.35గా పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గరుడ ఏసీ, గరుడ ప్లస్ ఏసీలో కనీస ఛార్జీ రూ.35, వెన్నెల ఏసీ స్లీపర్‌లో కనీస ఛార్జీ రూ.75లకు పెంచారు.
అన్ని రకాల బస్‌పాసుల ఛార్జీలు కూడా ప్రభుత్వం పెంచింది. సిటీ ఆర్డీనరీ పాస్ ఛార్జీ రూ.770 నుంచి రూ.950కి, మెట్రోపాస్ ఛార్జీ రూ 880 నుంచి రూ.1070కి, మెట్రో డీలక్స్ పాస్ ఛార్జీ రూ.990 నుంచి రూ.1180కి, స్టూడెంట్ బస్‌పాస్ రూ.130 నుంచి రూ.165 కి పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.