నల్గొండ: తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోనే సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ పరువు హత్య కేసులో నిందితులైన మారుతీరావు, ఎంఏ కరీంలపై మిర్యాలగూడ పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. మారుతీరావు తన అనుచరులను ఇంటికి పంపి ప్రలోభ పెడుతున్నారని ప్రణయ్‌ భార్య అమృత ఈ నెల 11న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కోర్టులో తమకు అనుకూలంగా సాక్ష్యంగా చెప్పాలని అమృతను మారుతీరావు, కరీంలు బెదిరిస్తున్నారని సీఐ సదానాగారాజు తెలిపారు. కాగా ప్రణయ్‌ హత్య కేసులో భార్య అమృతి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న విషయం అందిరికీ తెలిసిందే.

ఇటీవల మత్తిరెడ్డికుంటలోని అమృత ఇంటికి మారుతీరావు సన్నిహితుడు కందుల వెంకటేశ్వరరావు వచ్చాడని సీఐ సదానాగరాజు తెలిపారు. చెప్పినట్లు చేస్తే మీ తండ్రి ఆస్తినంతా రాసిస్తా అంటున్నాడని, ఆయనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నీదేనని, తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని అమృతను వెంకటేశ్వరరావు ప్రలోభ పెట్టాడని సీఐ తెలిపారు. అందుకు ఒప్పుకొని అమృత మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మారుతీరావు, కరీం, వెంకటేశ్వరరావును విచారించిన పోలీసులు మిర్యాలగూడ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం నిందితులను సబ్‌జైలుకు తరలించారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.