టీఆర్‌ఎస్‌ వైఫల్యంతో ఆర్టీసీ కార్మికుల బలిదానాలు...కేంద్రానికి ఎంపీల వినతి పత్రం

By Newsmeter.Network  Published on  28 Nov 2019 9:36 AM GMT
టీఆర్‌ఎస్‌ వైఫల్యంతో ఆర్టీసీ కార్మికుల బలిదానాలు...కేంద్రానికి ఎంపీల వినతి పత్రం

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యంతో తెలంగాణలోఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఆరోపించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్‌ సర్కార్‌ వ్యవహరిస్తున్నతీరుపై వినతి పత్రం అందించేందుకు కాంగ్రెస్‌ ఎంపీలు ప్రధాని కార్యాలయానికి తరలి వెళ్లారు. ప్రధాని మోడీ అందుబాటులోలేకపోవడంతో ప్రధాని కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రం అందజేసిన వారిలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యడు ఎంఏ ఖాన్‌ ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... తెలంగాణ ఆర్టీసీ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరినట్లు తెలిపారు. 49వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరినట్లు ఎంపీలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా ఆర్టీసీ కూడా విభజన జరిగిందని, గతంలో 57 వేల మంది ఉండే ఆర్టీసీకి తెలంగాణ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు, విలువైన స్థలాలు,భూములు ఉన్నాయన్నారు. ఆర్టీసీ సంస్థను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఆర్టీసీని ఆర్థికంగా నష్టాల్లో పడేలా చేస్తుందని, సర్కార్‌ నుంచి ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీ వివిధ రకాల బస్‌పాస్‌ల డబ్బులు ఇవ్వకుండా నిలిపివేసిందన్నారు. అలాగే ఆర్టీసీ వాడుతున్న పెట్రోల్‌, డీజిల్‌ పైన దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పన్నులు వేయడం వల్లకూడా ఆర్టీసీపై అధిక భారం పడుతుందన్నారు. ఆర్టీసీని కాపాడుకునేందుకు 49వేల మంది 50 రోజులకు పైగా సమ్మె చేశారని, సమ్మె కారణంగా దాదాపు 30 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వివరించారు.

పక్క రాష్ట్రమైన ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిందని, తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేయకుండా 5100 రూట్లను ప్రైవేటు పరం చేయాలని మంత్రి వర్గంలో తీర్మానించిందని, దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. ఇప్పుడు కార్మికులు 52 రోజుల తర్వాత సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరుతామని ప్రకటించినా...కార్మికులను ఉద్యోగాల్లో చేరనివ్వకుండా పోలీసుల చేత అరెస్టులు చేయిస్తూ ప్రభుత్వం నీచంగా ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీలో 33 శాతం వాటా కలిగి ఉందని, అందువల్ల ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఎంపీలు కోరారు.

Next Story
Share it