కొత్త సచివాలయానికి కేసీఆర్ చేసిన మార్పులు ఏమిటి?
By సుభాష్ Published on 22 July 2020 10:46 AM ISTఎవరేం అనుకున్నా ఫర్లేదు. ఏమైనా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేయటం కోసం ఎంత ఖర్చు అయినా పెడదాం. పని పూర్తి చేద్దామన్న మైండ్ సెట్ ఉండే ముఖ్యంత్రుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారు. తాను నమ్మింది చేసుకుంటూ పోవటమే కానీ.. ఆగటం అన్నది ఆయనకు తెలీదు. ఒకవేళ ఆగారు అంటే అది వ్యూహాత్మకమే తప్పించి మరొకటి కాదు. సచివాలయాన్ని తీసేసి.. కొత్త సచివాలయం నిర్మించాలన్న ఆలోచనలో ఉన్న కేసీఆర్.. అందుకు తగ్గట్లుగా పరిణామాలు చోటు చేసుకునేలా చేయటంలో సక్సెస్ కావటం తెలిసిందే.
ఇప్పటికే కొత్తగా నిర్మించాలని భావిస్తున్న సచివాలయ డిజైన్ ను సీఎం కేసీఆర్ ఓకే చేశారు. అయితే.. అందులో కొన్ని మార్పులు చేయాలని భావించారు. దీనికి తోడు.. సచివాలయ నిర్మాణం ఎలా ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. తానేం అనుకుంటున్న విషయాన్ని అధికారులకు మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొత్త సచివాలయం ఎలా ఉండాలన్న దానిపై తనకున్న ఆలోచనల్ని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని మార్పుల్ని సూచించినట్లుగా చెబుతున్నారు.
కొత్త సచివాలయం హుందాగా.. సౌకర్యవంతంగా ఉండాలని భావిస్తున్నారు. బాహ్యరూపం ఆకర్షణీయంగా.. లోపల రూపంలో సౌకర్యవంతంగా ఉండాలని కోరారు. అన్ని సౌకర్యాలు సదరు భవనంలో ఉండాలన్నారు. అందుకు తగ్గట్లు రూపొందించాలన్నారు. ఇప్పటికే ఓకే చెప్పిన డిజైన్ కు సంబంధించి కొన్ని మార్పులు సూచించారు. కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి.. మంత్రులు.. సీఎస్.. కార్యదర్శులు.. సలహాదారులు.. సిబ్బంది పని చేయటానికి అనుగుణంగా ఆఫీసులు ఉండాలన్నారు.
ఐదు ఫ్లోర్లు ఉండే సచివాలయంలో ప్రతి ప్లోర్ లోనూ డైనింగ్ హాట్.. సమావేశ మందిరం తప్పనిసరిగా ఉండాలన్నారు. వీఐపీలు.. డెలిగేట్స్ కోసం వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన ద్వారం సమీపంలో ఏర్పాటు చేసే జాతీయ జెండా వేదిక నమూనా దీర్ఘ చతురస్రాకారంలో ఉండనుంది. తొలి నమూనాతో పోలిస్తే.. భవనం ఎత్తు పెరిగింది. మొదట ఓకే అనుకున్న నమూనాలో భవనం ముందు కొలనుతో పాటు అటూ ఇటూ వెళ్లేందుకు వీలుగా రోడ్లను చూపించారు. పాత డిజైన్ కు సంబంధించి పలు మార్పుల్ని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.