సమత కేసు విచారణకై ప్రత్యేక కోర్టు
By సుభాష్
ఆసిఫాబాద్ అత్యాచారం బాధితురాలు సమత కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు హైకోర్టు ఆమోద ముద్ర వేసింది. దీంతో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదవ అదనపు సెషన్స్, ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా ఎల్లపటూర్ సమత కేసులో స్పెషల్ కోర్టు ఏర్పాటు కావడంతో త్వరగా విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
దిశ ఘటన జరిగినే నేపథ్యంలో తెలంగాణ సర్కార్ త్వరగా స్పందించిందని, సమత కేసులో కూడా సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. దోషులకు వెంటనే శిక్షలు పడేలా, బాధితులకు సత్వర న్యాయ జరిగేలా ప్రభుత్వం తమ వంతుగా కృషి చేస్తుందన్నారు. మహిళల భద్రత విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు చెప్పారు. మృగాళ్లు ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే విధంగా కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.