నిన్న తగ్గాయి.. నేడు పెరిగాయి

By సుభాష్  Published on  16 April 2020 1:57 PM GMT
నిన్న తగ్గాయి.. నేడు పెరిగాయి

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిన్న ఒక్క రోజు ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు రాగానే గురువారం ఒక్క రోజే 50 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 700కు పెరిగింది. వీటిలో 90శాతం కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు చెప్పారు. గురువారం కరోనాతో ఎవరు కూడా మరణించలేదని పేర్కొన్నారు. ఇక కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న 68 మందిని డిశ్చార్జ్‌ చేసినట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 496 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. ఇప్పటికి కరోనాతో 18 మంది మృతి చెందారు.

సూర్యాపేటలో ఒక్క రోజు 16 కేసులు

ఇక రాష్ట్రంలోని సూర్యాపేటలో గురువారం ఒక్క రోజు 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకే కుటుంబంలో 14 మందికి కరోనా సోకినట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 39కి చేరింది. ఈ కేసులన్ని ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌కు చెందినవేనని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో మంగళవారం 52 కేసులు నమోదు కాగా, బుధవారం ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇక కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయనుకునేలోపే గురువారం 50 కేసులు నమోదు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

Next Story