తెలంగాణలోకి కరోనా వచ్చే అవకాశమే లేదు..
By అంజి Published on 30 March 2020 1:41 AM GMTహైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటి వరకు 70 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మంది కోలుకున్నారని సీఎం కేసీఆర్ చెప్పారు. వారిని సోమవారం వరకు ఇళ్లకు పంపిస్తామన్నారు. అలాగే ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న కరోనా అనుమానితులు ఏప్రిల్ 7 వరకు పూర్తిగా కోలుకుంటారని అన్నారు. విదేశాలు నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయన్న ఆయన.. ఇక కొత్త కరోనా కేసులకు అవకాశాలు తక్కువ అని అన్నారు. అందరూ ఇళ్లకే పరిమితమై కరోనాని కట్టడి చేయాలన్నారు.
హోం క్వారంటైన్‌లో ఉన్న 25,935 మందిని 5,746 బృందాలు రోజుకు రెండు దఫాలుగా పర్యవేక్షిస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. వారి క్వారంటైన్ గడువు ఏప్రిల్ 7వ తేదీ నాటికి పూర్తవుతుందన్నారు. స్థానికంగా వ్యాధి సోకితేనే సమస్య అని, కరీంనగర్, కొత్తగూడెంలో అలాంటి వారిని గుర్తించామన్నారు.
ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా సామాజిక దూరం పాటించడం వల్లే కరోనాను తరిమికొట్టవచ్చన్నారు. లాక్‌డౌన్ వల్లనే భారత్‌కు మేలు జరిగిందని ప్రపంచ దేశాలన్నీ ప్రశంసిస్తున్నాయని, విదేశీ జర్నలిస్టులు మెచ్చుకుంటున్నారని అన్నారు. దక్షిణ కొరియాలో ఒకే వ్యక్తి వల్ల 59 వేల మంది కరోనా సోకింది.. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు.
Also Read: రూ.30లక్షల కోసమే ధోని క్రికెట్ ఆడాడు.. కానీ..
తెలంగాణలో 40 లక్షల ఎకరాల్లో వరి, యాసంగింలో మక్కలు 14 లక్షల టన్నులు వచ్చే అవకాశం ఉందన్నారు సీఎం కేసీఆర్. కూపన్ల పద్దతిలో కొనుగోలు చేపట్టాలన్న ఆయన.. నష్టం వచ్చినా సరే ప్రతి కిలోనూ ప్రభుత్వమే కొంటుందన్నారు. కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున గందరగోళం కాకుండా విక్రయాలు నిర్వహించాలన్నారు.
కరోనాపై అసత్య ప్రచారం చేసేవారిని కఠినంగా శిక్షిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇలాంటి వారికే అందరి కంటే ముందు కరోనా సోకుతుందన్నారు.
ఈ కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని, తమకు రాజకీయాలు లేవని పేర్కొన్నారు.