రేపు తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. కీలక అంశాలపై చర్చ..

By Newsmeter.Network  Published on  10 April 2020 6:17 AM GMT
రేపు తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. కీలక అంశాలపై చర్చ..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణలోనూ వేగంగా విస్తరిస్తోంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 471 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వీరిలో 45మంది నెగిటివ్‌ రావడంతో డిశ్చార్జ్‌ అయ్యారు. 12 మంది మృత్యువాత పడ్డారు. కాగా మర్కజ్‌లోని మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిలో పలువురికి వైరస్‌ సోకడం, వారి ద్వారా మరికొన్ని కాంటాక్ట్‌ కేసులు నమోదు కావటంతో ఒక్కసారిగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై మర్కజ్‌ వెళ్లొచ్చిన వారిని గుర్తించి వారిని క్వారంటైన్‌కు పంపించి, వారున్న ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో శనివారం సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ కేబినెట్‌ ప్రత్యేక సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 3గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు.

Also Read :కరోనాకు లొంగని 101ఏళ్ల వృద్ధుడు.. క్షేమంగా ఇంటికి..

ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ గడువు ఈనెల 14తో ముగియనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడగించాలని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్‌ సూచించారు. ఒకవేళ కేంద్రం లాక్‌డౌన్‌ గడువును పెంచకపోయినా రాష్ట్రంలో మే 3వరకు లాక్‌డౌన్‌ను విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒరిస్సా కేంద్రంతో సంబంధం లేకుండా ఏప్రిల్‌ 30వరకు లాక్‌డౌన్‌ను విధించడం విధితమే. ఉత్తర ప్రదేశ్‌ సీఎంసైతం 15 జిల్లాల్లో ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌ విధించారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఏప్రిల్‌ మొదటి వారంలోనే రూ. 2400 కోట్లు రావాల్సిన ఆదాయం కేవలం రూ. 6కోట్లు మాత్రమే వచ్చిందని సీఎం కేసీఆర్‌ గత రెండు రోజుల క్రితం వెల్లడించారు. దీంతో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాబోయే కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.

Also Read :అకాల వర్ష బీభత్సం.. ఏపీలో 14 మంది మృతి..

దీనికితోడు వలస కార్మికులకు అందించే సహాయంపైనా, లాక్‌డౌన్‌ జరుగుతున్న తీరుపైనా, కరోనా పాజిటివ్‌ కేసులు పెరగకుండా చేపడుతున్న చర్యలపై మంత్రివర్గంలో సుధీర్ఘంగా చర్చించి.. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే రాష్ట్రంలో గత రెండు రోజులుగా అకాల వర్షంతో రైతులు సాగుచేసిన పంటలు దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం వరి కోత దశలో ఉండగా, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలుసైతం కోతకొచ్చాయి. ఈ తరుణంలో అకాల వర్షంతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్ర భుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రేపు 3గంటలకు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపైనా చర్చించనున్నారు. అకాల వర్షంతో ఎంత పంటనష్టం వాటిల్లింది, నష్టపోయిన రైతులను ఏ విధంగా ఆదుకోవాలనే అంశాలపై సీఎం కేసీఆర్‌ మంత్రుల చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Next Story