కరోనాకు లొంగని 101ఏళ్ల వృద్ధుడు.. క్షేమంగా ఇంటికి..

By Newsmeter.Network  Published on  10 April 2020 5:11 AM GMT
కరోనాకు లొంగని 101ఏళ్ల వృద్ధుడు.. క్షేమంగా ఇంటికి..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మహమ్మారి భారిన పడి వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. అగ్రదేశం అమెరికా నుంచి చైనా, బ్రిటన్‌, స్పెయిన్‌ ఇలా అన్ని దేశాలు ఈ వైరస్‌ భారినపడి అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 15,96,496 మంది కరోనా వైరస్‌ భారిన పడగా, వీరిలో 95,506 మంది మృత్యువాత పడ్డారు. 3.50లక్షల మంది కరోనా వైరస్‌ నుంచి చికిత్స పొందుతూ కోలుకున్నారు. ఇదిలాఉంటే ఈ వైరస్‌ ప్రభావం వృద్ధులపై ఎక్కువగా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. గణాంకాలు చూసినా ఇప్పటి వరకు చనిపోయిన వారిలో 50ఏళ్ల పైబడిన వారే అధికంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, ఒక్కసారి వైరస్‌ సోకితే వారి నుండి వైరస్‌ను తొలగించడం చాలా కష్టతరంగా ఉంటుందని పలువురు వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Also Read :దేశంలో 7వేలకు చేరువలో కరోనా కేసులు.. 231 మంది మృతి..

కానీ కరోనా వైరస్‌ సోకిన 101 ఏళ్ల వృద్ధుడు మాత్రం వైరస్‌ మహమ్మారిని ఢీకొట్టి క్షేమంగా ఇంటికి చేరాడు. బ్రిటన్‌లోని వోర్సెస్టర్‌సైర్‌లో నివాసముండే కిత్‌ అనే 101 ఏళ్ల వృద్ధుడికి అనారోగ్యంగా ఉండటంతో రెండు వారాల క్రితం అలెగ్జాండ్రా ఆస్పత్రిలో చేర్పించారు. కిత్‌కు తీవ్ర జ్వరం ఉండటంతో వెంటనే వైద్యులు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయన్ను ఆస్పత్రిలోని 12వ వార్డులోకి చికిత్స నిమిత్తం తరలించారు. రెండు వారాల చికిత్స అనంతరం ఆ వృద్ధుడు వైరస్‌ నుంచి కోలుకున్నారు. అంతేకాక కిత్‌ ఉత్సాహంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Also Read :తెలంగాణలో 130 కరోనా హాట్‌స్పాట్లు

ఈ సందర్భంగా కిత్‌కు వైద్యసేవలు అందించిన ఆస్పత్రి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మాథ్యూహాప్కిన్స్‌ మాట్లాడుతూ.. కిత్‌ ఆస్పత్రికి వచ్చినప్పుడు తీవ్ర జ్వరంతో ఉన్నాడని, వైద్య చికిత్సల అనంతరం సురక్షితంగా ఇంటికి వెళ్లాడని తెలిపారు. అతను పూర్తిగా కరోనా వైరస్‌ను జయించాడని తెలిపారు. ఇదిలాఉంటే ఆస్పత్రికి నుంచి వెళ్తున్న క్రమంలో వృద్ధుడితో ఆస్పత్రికి సిబ్బంది ఉన్న ఫొటోను అతని కోడలు జో వాట్సన్‌ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. దీంతో ఆ ఫోటోను వేలాది మంది షేర్‌ చేయగా, కిత్‌ను ప్రశంసిస్తూ కామెంట్లు వచ్చాయి. ఈ సందర్భంగా జో వాట్సన్‌ మాట్లాడుతూ.. ఆయనకు కరోనా వైరస్‌ సోకిందని తెలిసినప్పుడు మేం చాలా బయపడ్డామని తెలిపారు. రకరకాల ఆలోచనలు మా మనస్సును కలిచివేశాయని, కానీ ఆయన ఈ వయస్సులోనూ నిబ్బరంగా ఉన్నారని, వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నాడని, దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని, క్షేమంగా ఇంటికి తీసుకెళ్లామని తెలిపారు.

Next Story