తెలంగాణ బడ్జెట్ - 2023: కొత్త పథకాలతో భారీ స్కెచ్.. మరీ నిధులెక్కడా?
The Telangana government will introduce new schemes in the election year budget. ఫిబ్రవరి 6వ తేదీన తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. గతేడాది కంటే ఈ సారి భారీ
By అంజి Published on 3 Feb 2023 5:59 AM GMTఫిబ్రవరి 6వ తేదీన తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. గతేడాది కంటే ఈ సారి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోందని ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం. ఈ బడ్జెట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం రెండవ టర్మ్ చివరి పూర్తి బడ్జెట్. దాదాపుగా రూ. మూడు లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుందని లీకులు వినబడుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌పై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం కూడా జనాకర్షక పథకాలను అమలు చేయాలని భావిస్తోంది. ఎందుకంటే.. ప్రజల్ని ఆకట్టుకోవడానికి ఇదే బీఆర్‌ఎస్ సర్కార్‌కు చివరి ఛాన్స్. అయితే దీని కోసం ప్రజలపైనే మోస్తరుగా పన్నులు పెంచి నిధులు సమీకరించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరువ అయ్యేలా ఈసారి బడ్జెట్ రూపకల్పన జరుగుతోంది. దళితు అభ్యున్నతికి, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేయనుంది. 2014లో లక్షా ఆరు వందల 48 కోట్లతో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టగా, ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత బడ్జెట్ మూడింతలకుపైగా పెరగనుంది. వ్యవసాయ తోడ్పాటు, మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేయనుంది. దళితబంధుకు రూ.20 వేల కోట్ల కేటాయింపులు జరగనున్నట్లు అంచనా.
అలాగే కొత్త ఇళ్లు స్కీమ్‌కు రూ.18 వేల కోట్లు, ఆసరా పెన్షన్లు, నిరుద్యోగ భృతి పెంపుతో పాటు.. పెళ్లి వేడుకలోనే కొత్త జంటలకు ఆర్థిక సాయం అందించేలా కల్యాణలక్ష్మికి మరిన్ని నిధులను ఈ బడ్జెట్‌లో కేటాయిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రైతుబంధుకు రూ.16 వేల కోట్లు, కేసీఆర్ కిట్‌కు, పౌష్టి కాహార పథకానికి రూ.1000 కోట్లు కేటాయించనున్నట్లు అంచనా. దీంతో పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి రూ.3 వేల కోట్లు, ఆసరా పింఛన్లు రూ.12 వేల కోట్లకుపైగా ఉండనున్నాయి. భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్లు, గీత కార్మికుల సంక్షేమానికి స్పెషల్ స్కీమ్ ప్రకటించనున్నట్లుగా సమాచారం. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌కు, ఆరోగ్య సంరక్షణ కిట్‌లకు పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు జరగనుంది.
హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి గ్రామాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం, జలమం డలి ఉచిత నీటి పథకానికి, వైద్య,ఆరోగ్య శాఖకు రూ.15 వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ సారి భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టే విషయంలో తెలంగాణ సర్కార్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మొత్తం ఎక్కడి నుంచి తీసుకువస్తారో కూడా బడ్జెట్ పద్దుల్లో చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. దానికి తోడు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు రాలేదు. చివరికి అప్పులపై కూడా కేంద్రం పరిమితి విధించింది.