తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శం: గవర్నర్ తమిళిసై
Telangana Developing In All Segments Under Cm Kcr Rule Says Governor Tamilisai. హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ 2023-24 వార్షిక బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
By అంజి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ 2023-24 వార్షిక బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12:10 గంటలకు సభ ప్రారంభమైంది. తెలంగాణ సమ్మిళిత అభివృద్ధి దేశానికే రోల్ మోడల్ అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శుక్రవారం శాసనసభలో గవర్నర్ ప్రసంగించారు. ''రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అద్భుతంగా పురోగమిస్తోంది. తెలంగాణ రాష్ట్రం సాధించిన అసాధారణ విజయం ప్రజల ఆశీర్వాదం, సీఎం నైపుణ్యంతో కూడిన పరిపాలన, ప్రజాప్రతినిధుల కృషి, ప్రభుత్వ ఉద్యోగులు చూపుతున్న అంకితభావం వల్లనే తెలంగాణ అపూర్వ విజయాలను సాధించింది'' అని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్రమంతా కరెంటు కోతలు, అంధకారంతో రాష్ట్రం అతలాకుతలమైన సందర్భం ఉందని గవర్నర్ అన్నారు.
ఒకనాడు రాష్ట్రమంతా కరెంటు కోతలు, అంధకారంతో అతలాకుతలమైందని.. ఈ రోజు తన ప్రభుత్వం చేసిన కృషి కారణంగా 24 గంటల విద్యుత్ సరఫరాతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతోందన్నారు. వ్యవసాయం కుదేలైపోయి విలవిలలాడిన నేల.. నేడు దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించిందన్నారు. తాగునీటి కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడి, వందశాతం గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా నల్లాల ద్వారా స్వచ్ఛమైన సురక్షిత జలాలను సరఫరా చేస్తోందన్నారు. ఒకనాడు పాడుబట్టినట్టున్న తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారి, నేడు అత్యున్నత జీవన ప్రమాణాలతో ఆదర్శవంతంగా తయారయ్యాయని అన్నారు. పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచస్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటీ రంగంలో మేటీ రాష్ట్రం తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు పెడుతోందన్నారు.
''రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది. పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు పచ్చదనాన్ని పెంపొందించడంలోనూ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నదని గవర్నర్ తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వంటి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల విజయాలను వివరించిన తమిళిసై.. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ వంటి విజయాల గురించి కూడా వివరించారు. 2014 -15లో రాష్ట్ర ఆదాయం రూ.62 వేల కోట్లు మాత్రమే ఉండగా, తన ప్రభుత్వం చేసిన గొప్ప కృషి వల్ల 2021 నాటికి 1 లక్షా 84 వలే కోట్ల రుపాయలకు పెరిగిందన్నారు. 2014 - 15లో రాష్ట్ర తలసరి ఆదాయం సగటు 1,24,104 రూపాయలు ఉండగా, 2022 - 23 నాటికి 3 లక్షల 17 వేల 115 రూపాయలకు పెరిగిందన్నారు. న్నిరంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధించిన ప్రభుత్వాన్ని అభినందించారు.
ఆసహాయులకు ఆసరా, గిరిజనులను, బీసీ వర్గాల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మత్స్యకారులు, నేత కార్మికుల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ చర్యలను చేపట్టిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మహిళల జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.