పోడుభూముల పంపిణీపై సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..?
CM KCR Speech in Assembly About Podu Bhoomulu.పోడు భూములపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక విధానం
By తోట వంశీ కుమార్ Published on 10 Feb 2023 1:39 PM ISTపోడు భూములపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక విధానం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. పోడు భూములపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. విచక్షణారహితంగా అడవులను నరికివేయడం సరికాదన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.
ప్రతీసారి పోడుభూములపై రాజకీయం చేయడం సరికాదన్నారు. పోడు, అటవీ భూములు పలువురికి ఆటవస్తువులా తయారయ్యాయని మండిపడ్డారు. పోడు భూములపై ప్రభుత్వానికి ప్రత్యేక విధానం ఉంది. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. వాటిపై ఇప్పటికే నివేదికలు సిద్దం అయ్యాయి. ఈ నెలాఖరు లోపు పోడు భూముల పంపిణీని ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.
గిరిజనులకు గత పాలకులు చేసిన మోసాలు అందరికి తెలుసునని అన్నారు. గిరిజనులపై దౌర్జన్యం జరుగకుండా చూడాలన్నారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పోడు భూములు పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, సాగునీటి సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
భూములు తీసుకున్న గిరిజనులు ఇకనుంచి పోడు భూములను రక్షిస్తామని హామీ ఇవ్వాలన్నారు. చెట్లు నరకబోమని సంతకాలు పెడితేనే భూములు పంచుతామన్నారు. పంపిణీ పూర్తి అయ్యాక అటవీ ప్రాంతాలను ఆక్రమిస్తే ఉరుకునేది లేదన్నారు. భూమిలేని గిరిజన బిడ్డలకు దళితబంధు తరహాలోనే గిరిజన బంధు పథకం అమలు చేస్తామని చెప్పారు.
గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారులు దాడిచేయవద్దని సూచించారు. అదేసమయంలో అధికారులపైనా గిరిజనుల దాడులు సహించబోమన్నారు. అటవీ ప్రాంతాల్లో ఇక పై చెట్లను కొట్టనివ్వమన్నారు. అడవుల పునరుజ్జీవనం చేసే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వ కృషి వల్ల రాష్ట్రంలో 7.8 శాతం గ్రీన్ కవర్ పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు.