అడవే 'అమ్మ'..'యాదాద్రి మోడల్'కి జై
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Oct 2019 3:42 PM GMTచెట్టు ఉంటేనే భవిష్యత్తు
చెట్టు ఉంటేనే పర్యావరణ సమతుల్యం
చెట్టు ఉంటేనే భావితరాలకు భరోసా
చెట్టులేకపోతే అంతా శూన్యం
ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని ఎలా కాపాడుతుందో..
చెట్టును రక్షిస్తే అది కూడా మనల్ని అలానే కాపాడుతుంది.
చెట్టు ఉన్నచోట గాలి పరిమళం
చెట్టు ఉన్నచోట మట్టి పరిమిళం
చెట్టు ఉన్న చోట ఆకాశం హరివిల్లు
చెట్టు ఉంటే పుట్ట ఉంటుంది..
చెట్టు ఉంటే అడవి అల్లుకుంటుది..
చెట్టు ఉంటే పక్షులు కిలకిలరావాలు..
చెట్టు ఉంటే లేడి పిల్లల కేరింతలు..
చెట్టు ఉంటే వన్యప్రాణాలకు ప్రాణం..
చెట్టు ఉంటే పండ్లు, ఫలహారాలు పదిలం..
చెట్టును కాపాడుకోవడమంటే..
మనల్ని మనం కాపాడుకోవడం.
అందుకే అడవిని నాటుదాం..
అప్పుడు ఆ అడవే 'అమ్మ' అవుతుంది.
తక్కువ భూమిలో ఎక్కువ మొక్కలు నాటాలి. కొద్ది ఖర్చుతో దట్టమైన అడవిని పెంచాలి.
ఆ అడవిలో అన్ని ఉండాలి. ఇదే ఆలోచనతో ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ అటవీ శాఖ. యాదాద్రి మోడల్ మియావాకి ఫారెస్ట్ పెంపకం మంచి ఫలితాలను ఇస్తుంది. దీంతో రాష్ట్ర మంతా ఇదే విధానాన్ని అమలు చేయడానికి అటవీ శాఖ సిద్ధమైంది. దట్టమైన అడవులను పెంచడానికి ప్రణాళికలు రచిస్తుంది.
ప్రస్తుతం అటవీ శాఖ పెద్ద ఎత్తున చేపట్టిన అటవీ పునరుజ్జీవన చర్యలకు దిగింది. క్షీణించిన అటవీ ప్రాంతాల్లో ఒక్కో ఎకరాను మియావాకి విధానంలో అడవులుగా మారుస్తున్నారు. అభివృద్ది, వివిధ ప్రాజెక్టుల వల్ల అటవీ భూములు క్షీణించటం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామం. క్షీణించిన అటవీ ప్రాంతంలో పూర్తి శాస్త్రీయ పద్దతుల్లో మట్టిని ట్రీట్ మెంట్ చేయటం, వర్మీ కంపోస్టును వాడుతూ, ఆ మట్టి స్వభావానికి అనుగుణమైన మొక్కలను గుర్తించి నాటుతారు. దాదాపు రూ. 2.5 లక్షల ఖర్చుతో నలభై ఐదు రోజుల్లో ఒక ఎకరా భూమిని అటవీ ప్రాంతంగా అభివృద్ది చేయవచ్చు.
తెలంగాణలో దీనిని 'యాదాద్రి మోడల్' గా అమలు చేస్తున్నారు. ఆవు పేడ, మూత్రంతో తయారు చేసే జీవామృతం లాంటి స్థానిక విధానాలను కూడా దీనికి జోడిస్తున్నారు. చౌటుప్పల్ దగ్గర తంగేడువనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో ఒక ఎకరా భూమిలో పెంచిన మియావాకి అడవి కేవలం ఏడాదిలోనే మంచి ఫలితాలను ఇస్తోంది. అక్కడ నాటిన మారేడు, నేరేడు, రేల, ఇప్ప, మోదుగు, రోజ్ వుడ్, మద్ది, వేప, శ్రీ గంధం, తాని, జమ్మి, టేకు, ఉసిరి, సీతాఫలం, వెదురు, గోరింటాకు మొక్కలు ఏపుగా పెరిగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పచ్చదనం అలుముకుంది. ఈ ప్రయోగం ఇచ్చిన ఉత్సాహంతో అటవీ శాఖ ముందుకు వెళ్తుంది.
అలాగే పట్టణ ప్రాంతాలకు సమీపంలో లభ్యమయ్యే తక్కువ విస్తీర్ణం భూముల్లో పెంచేందుకు అనువుగా ఉంటుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రస్తుతం అభివృద్ది చేస్తున్నఅన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో మియావాకి విధానంలో కొద్ది ప్రదేశంలో మొక్కలు అటవీశాఖ నాటుతోంది. అర్బన్ పార్కులకు వచ్చే సందర్శకులు, విద్యార్థులకు కూడా ఈ విధానంపై అవగాహన పెంచాలని నిర్ణయించింది.
వైవీ రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్ .కామ్