ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా ఘ‌న‌విజ‌యం సాధించింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్టులోనూ ఇన్నింగ్స్ విజ‌యం అందుకుంది. బంగ్లాదేశ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే క‌ట్ట‌డి చేసిన టీమిండియా.. ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో విజయం​ సాధించింది.

ఆదివారం మూడో రోజు ఆట ప్రారంభించిన‌ బంగ్లాదేశ్‌.. ఇన్నింగ్స్‌ను గంటసేప‌ట్లోనే ముగించింది. ఓవర్‌నైట్‌ ఆటగాళ్లు తైజుల్‌ ఇస్లామ్‌(11), ముష్పికర్‌ రహీమ్‌(74)లతో పాటు ఎబాదత్‌ హుస్సేన్‌(0)ల‌ను ఉమేశ్‌ యాదవ్‌ ఔట్‌ చేయడంతో బంగ్లాదేశ్‌ 184 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. మూడో రోజు ఆట‌లో బంగ్లా కేవ‌లం 43 పరుగులు మాత్రమే చేసింది.

టీమిండియా బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ ఐదు వికెట్లతో రాణించ‌గా.. తొలి ఇన్నింగ్స్‌లో 5వికెట్లు సాధించిన‌ ఇషాంత్‌ శర్మ రెండో ఇన్నింగ్సులోనూ నాలుగు వికెట్లు సాధించాడు. మొత్తం ఈ టెస్టులో 9 వికెట్లు తీసాడు. ఇక‌పోతే.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ 347/9 వద్ద డిక్లేర్డ్‌ చేయగా.. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌట‌య్యింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.