చివ‌ర్లో చిత‌కొట్టిన టీమిండియా.. ఎదురీదుతున్న లంక‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Jan 2020 4:28 PM GMT
చివ‌ర్లో చిత‌కొట్టిన టీమిండియా.. ఎదురీదుతున్న లంక‌

శ్రీలంకతో మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా పుణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా జ‌రుగుతున్న‌ చివరి టీ-20 మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. ముందుగా శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు.

లంక బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ధవన్(52) 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సుతో అర్థశతకం సాధించాడు. అయితే హాప్ సెంచ‌రీ పూర్తిచేసిన వెంట‌నే సందకన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. వెంట‌నే తర్వాతి ఓవర్‌లో అర్థశతకం సాధించిన మ‌రో ఓపెన‌ర్ లోకేశ్ రాహుల్(54) స్టంప్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన శ్రేయస్ అయ్యార్ ఒక ఫోర్‌ కొట్టి త‌ర్వాతి బంతికే వెనుదిరిగాడు.

త‌ర్వాత‌ మనీశ్ పాండే, విరాట్ కోహ్లీలు జట్టును ఆదుకొనే ప్రయత్నిం చేశారు. ఐదో వికెట్‌కి వీరిద్దరు కలిసి 44 పరుగులు చేశారు. ఈ క్ర‌మంలో కోహ్లీ(26) 18వ ఓవర్‌లో అనవసర పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే వాషింగ్టన్ సుందర్(0) డక్ అవుట్ అయ్యాడు. త‌ర్వాత‌ క్రీజ్‌లోకి వచ్చిన శార్ధూల్ ఠాకూర్, మనీశ్ పాండేతో కలిసి మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. చివరి రెండు ఓవర్లలో వీరిద్దరు కలిసి 34 పరుగులు చేశారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 201 పరుగులు చేసింది. లంక బౌలర్ల‌లో సందకన్ 3, కుమారా, హసరంగా తలో వికెట్ తీశారు.

ఆ త‌ర్వాత చేద‌న‌కు దిగిన లంక ఓపెన‌ర్లు.. బుమ్రా వేసిన మొదటి ఓవర్‌లో గుణతిలక(1), శార్దూల్ వేసిన రెండో ఓవర్‌లో అవిష్క పెర్నాండో(9) వెనుదిరిగారు. ఆ వెంట‌నే బుమ్రా వేసిన నాలుగో ఓవర్‌లో ఒషాడా ఫెర్నాండో(2)ను మనీశ్ పాండే రనౌట్ చేశాడు. ఇక నవ్‌దీప్ సైనీ వేసిన ఆరో ఓవర్ మొదటి బంతికి కుషల్ పెరీరా(7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 12.2 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. క్రీజ్‌లో శ‌న‌క‌(2), ధనుంబయ డి సెల్వ(46) ఉన్నారు.

Next Story