కివీస్ ప‌ర్య‌ట‌న‌కు పాండ్యా దూరం.. రాహుల్ కు స్థానం ద‌క్కేనా..?

By Newsmeter.Network  Published on  12 Jan 2020 8:00 AM GMT
కివీస్ ప‌ర్య‌ట‌న‌కు పాండ్యా దూరం.. రాహుల్ కు స్థానం ద‌క్కేనా..?

సొంత గ‌డ్డ‌పై దుమ్ము రేపిన భార‌త జ‌ట్టు ఇక విదేశీ ప‌ర్య‌ట‌న‌లో స‌త్తా చాట‌డానికి సిద్ద‌మైంది. కొత్త ఏడాది న్యూజిలాండ్ లో పర్య‌టించే భార‌త జ‌ట్టును నేడు ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెల‌క్ష‌న్ క‌మిటీ ఎంపిక చేయ‌నుంది. ఈ నెల 24నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో అతిథ్య జ‌ట్టుతో ఐదు టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడ‌నుంది. దీంతో మూడు ఫార్మాట్ల‌కు ఆదివారం జ‌ట్టును ఎంపిక చేయ‌నున్నారు.

వెన్నునొప్పికి సర్జరీ కారణంగా నాలుగు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆల్ రౌండ‌ర్ హార్థిక్ పాండ్యా రావ‌డం లాంచ‌న‌మ‌నే అనుకుంటుండ‌గా అనుకోని షాక్ త‌గిలింది. కీలకమైన ఫిట్‌నెస్‌ టెస్టులో హార్థిక్ విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో అత‌ని రాక మ‌రింత ఆల‌స్యం కానుంది. అంతేకాకుండా కివీస్‌ పర్యటనకు వెళ్లే భారత్‌ ‘ఎ’ పరిమిత ఓవర్ల జట్టు నుంచి కూడా పాండ్యాను తప్పించారు. రంజీ మ్యాచ్‌ల్లో ఆడించకుండానే పాండ్యాను నేరుగా ‘ఎ’ జట్టులో తీసుకున్నారు. ఇక అతడి స్థానంలో విజయ్‌ శంకర్‌కు చోటు కల్పించారు.

రాహుల్ లేదా గిల్..

టెస్టు జ‌ట్టును ఎంపిక చేయ‌డం సెల‌క్ట‌ర్ల‌కు పెద్ద క‌ష్ట‌మేమి కాదు. దాదాపుగా బంగ్లాదేశ్ తో ఆడిన జ‌ట్టునే ఎంపిక చేయ‌నున్నారు. ఓపెన‌ర్లుగా రోహిత్ శ‌ర్మ, మ‌యాంక్ అగ‌ర్వాల్ లు అద్భుతంగా రాణిస్తుండ‌డంతో వీరి జోడిని విడ‌గొట్టే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. రిజ‌ర్వు ఓపెన‌ర్ కోసం రాహుల్ , యువ ఆట‌గాడు శుభ్ మ‌న్ గిల్ మ‌ధ్య పోటీ నెల‌కొని ఉంది. రాహుల్ ప్ర‌స్తుతం ఫామ్ లో ఉండ‌డం అనుభ‌వం కూడా ఉండ‌డం రాహుల్ కు క‌లిసి వ‌చ్చే అంశం. ఐదో పేసర్‌ (సైనీ) కాకుండా మూడో స్పిన్నర్‌ అవసరమనుకుంటే కుల్దీప్‌ యాదవ్‌ను తీసుకునే చాన్స్‌ ఉంది. నలుగురు పేసర్లుగా బుమ్రా, ఉమేశ్‌, షమి, ఇషాంత్‌ ఎంపిక లాంఛనమే. జడేజా, అశ్విన్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్లుగా ఉండనున్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా న్యూజిలాండ్‌తో భారత్‌ రెండు టెస్టులలో తలపడనుంది. ఇప్పటికే ఆడిన 7 టెస్టుల ద్వారా 360 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉన్న జట్టు ఈ సిరీస్‌ కూడా గెలిస్తే వచ్చే ఏడాది జరిగే టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు దాదాపుగా అర్హత సాధించినట్లే !

కేదార్ కు చోటు ద‌క్కేనా..?

వన్డేలు, టి20ల విషయంలో ప్ర‌స్తుత ఫామ్‌ను తీసుకుంటే పెద్దగా మార్పులు కనిపించడం లేదు.ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొనే టి20 జట్టును ఎంపిక చేయడం ఖాయం. శ్రీలంకతో సిరీస్‌లో ఒక్క రవీంద్ర జడేజాకు తప్ప అందరికీ మ్యాచ్‌ అవకాశం దక్కింది. అయితే వన్డే, టి20ల్లో అతని ఆల్‌రౌండ్‌ నైపుణ్యం జట్టుకు ఎప్పుడైనా అదనపు బలమే కాబట్టి అతడి స్థానానికి ఢోకా ఉండకపోవచ్చు. పాండ్యా దూరం కావడంతో శివమ్‌ దూబే తన స్థానాన్ని నిలబెట్టుకున్నట్లే. రోహిత్‌ మళ్లీ వస్తాడు కాబట్టి సంజు సామ్సన్‌నే తప్పించవచ్చు.

ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ మంచి ఫినిష‌ర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు కేదార్ జాద‌వ్‌. చివ‌ర్లో ధాటిగా ఆడ‌డంతో పాటు స్పిన్ బౌలింగ్ చేయ‌గ‌ల‌డు. అయితే గాయాలతో స‌త‌మ‌త‌మ‌వుతూ జ‌ట్టులోకి వ‌స్తూ పోతూ ఉన్నాడు. నిజానికి వన్డే జట్టులో కేదార్‌ జాదవ్‌ స్థానం అనుమానంగానే మారింది. కివీస్‌ గడ్డపై గతంలో అతడి బ్యాటింగ్‌లోనూ లోపాలు కనిపించాయి.సాంకేతికంగా మెరుగైన బ్యాట్స్‌మన్‌ కావాలనుకుంటే రహానె పేరును పరిగణనలోకి తీసుకోవచ్చు. కానీ టీ20 తరహాలోనే వన్డేల్లోనూ మెరుపు బ్యాటింగ్‌ను ఆశిస్తే ముంబై బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఐదు లేక ఆరో నెంబర్‌లో జట్టుకు ఉపయోగపడగలడు. శాంసన్‌, సూర్య ఇద్దరూ భారత్‌ ‘ఎ’ జట్టులోనూ ఉన్నారు.

Next Story
Share it