ఆదుకోవాల్సిన సమయంలో..ప్రజల ప్రాణాలతో చెలగాటమా ?

By రాణి  Published on  21 April 2020 10:17 PM IST
ఆదుకోవాల్సిన సమయంలో..ప్రజల ప్రాణాలతో చెలగాటమా ?

  • రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తిన చంద్రబాబు

కరోనా అనేది భయంకరమైన వైరస్ అని, దానికి నివారణ మినహా మరో మార్గం లేదన్నారు టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు. మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆంధ్రాలో కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు..రాష్ట్రంలో కరోనా తీవ్రతను ప్రజలకు తెలియకుండా దాచే ప్రయత్నం చేయొద్దని మొదట్నుంచీ చెప్తూనే ఉన్నామని హితవు పలికారు. ప్రజలకు మంచి చేయమని చెప్పినా దానిని రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దదని..కరోనా వైరస్ తగ్గుముఖం పట్టేంత వరకూ ప్రతి విషయంలోనూ ప్రభుత్వం బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రెడ్ జోన్లుగా ప్రకటించిన 11 జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే గానీ ఆ మహమ్మారి నుంచి బయటపడలేమన్నారు.

Also Read : భారత్ లో 600 దాటిన మరణాలు..

కరోనా రోగులకు చికిత్సలందిస్తున్న వైద్యులు,సిబ్బందికి ఆ వైరస్ అంటకుండా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారా ? వారికి కనీసం మాస్క్ లు, పీపీఈలు ఇస్తున్నారా ? అని ప్రశ్నించారు చంద్రబాబు. అలాగే కరోనా పై క్షేత్రస్థాయిలో చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని చాలాసార్లు విజ్ఞప్తి చేసినా..ప్రభుత్వం దానిని పెడచెవిన పెట్టిందని విమర్శించారు.

ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై ధ్వజం

రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేసేందుకు దక్షిణ కొరియా నుంచి తెప్పించిన టెస్ట్ కిట్లు ఒక్కొక్కటి రూ.730కి కొనుగోలు చేశామంటూ ప్రభుత్వం దొంగ లెక్కలు చూపించిందని ధ్వజమెత్తారు. అవే కిట్లను ఛత్తీస్ గడ్ రూ.350కి కొనుగోలు చేసిందని ఆరోపణలు రావడంతో మళ్లీ ధర తగ్గుతుందని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట్నుంచి రాష్ట్ర ప్రభుత్వం విపక్ష నేతలు ఏం మాట్లాడినా ఎదురుదాడి చేస్తూ..కేసులు పెడుతోందని ఆరోపించారు. ప్రజలకు మంచి చేయాలని చెప్పినా ఇలా ప్రవర్తించడం చాలా బాధాకరమన్న చంద్రబాబు ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో కూడా కక్కుర్తి పడతారా అని నిలదీశారు.

ఎస్ఈసీ నియామకంపై ఫైర్

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే ప్రజల మేలు ఆలోచించడం మానేసి ఎస్ఈసీ ని తొలగించడంపైనే దృష్టి సారించారని చంద్రబాబు ఆరోపించారు. అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేశామన్న ప్రభుత్వం చెన్నై నుంచి కనకరాజ్ ను ఏపీలోకి ఎలా రానిచ్చింది ? వారికి క్వారంటైనా నియమాలు వర్తించవా ?గిట్టుబాటు లేక ఆక్వా, పౌల్ట్రీ రైతులు దెబ్బతిని ఆత్మహత్యలకు పాల్పడుతుంటే వారిని ఆదుకోకపోగా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చలు జరుపుతారా ? అని ప్రశ్నించారు. కేరళలో ప్రజలకు రెండు నెలలకు సరిపడా నిత్యావసరాలు అందజేస్తే..మనరాష్ట్రంలో ఇంకా కొంతమందికి నెలకు సరిపడా సరుకులే అందలేదని విమర్శించారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ప్రజల జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదని, అందరితో కలిసి పనిచేస్తేనే కరోనాను రాష్ట్రం నుంచి తరిమికొట్టగలమన్నారు.

Also Read : కోవిడ్ పేషెంట్ల కోసం వెంటిలేటర్ రూపొందించిన మాజీ ఎంపీ

Next Story