కోవిడ్ పేషెంట్ల కోసం వెంటిలేటర్ రూపొందించిన మాజీ ఎంపీ

By రాణి  Published on  21 April 2020 2:47 PM GMT
కోవిడ్ పేషెంట్ల కోసం వెంటిలేటర్ రూపొందించిన మాజీ ఎంపీ

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాధికి చికిత్సనందించేందుకు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇకో - వెంట్ పేరుతో సరికొత్త వెంటిలేటర్ ను రూపొందించారు. ఇంజినీరింగ్ చదివిన విశ్వేశ్వర్ రెడ్డి తాను రూపొందించిన ఈ వెంటిలేటర్ ను ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగంలోనే గొప్ప మలుపుగా చెప్పుకొచ్చారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

'' ఇకో - వెంట్ అంటే ఇండియన్ కోవిడ్ వెంటిలేటర్ అని అర్థం. ప్రస్తుతం కోవిడ్ 19 నుంచి కోలుకునేందుకు ప్రపంచమంతా ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు అవసరమైన పరికరాలను రూపొందించే సామర్థ్యం మన దేశ ఇంజినీరంగ్ రంగానికి ఉంది. అది ఇలా నిరూపితమైంది. ఇకో వెంట్ ను రూపొందించేందుకు వాడిన వస్తువులన్నీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ లభ్యమవుతాయి. కోవిడ్ -19విజృంభణ నేపథ్యంలో సుమారు ప్రపంచానికి 10 లక్షల వెంటిలేటర్ల అవసరం ఉంటుంది..ఆ లోటును ఈ ఇకో వెంట్ ఖచ్చితంగా భర్తీ చేస్తుంది. ఇది మనుషులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకై కృషి చేస్తాను. కోవిడ్ పేషెంట్లకు చికిత్సను అందించేందుకు ఎన్నో రకాల వెంటిలేటర్లున్నా అవేమీ ఉపయోగపడవన్న ఆలోచన నుంచి పుట్టిందే ఇకో - వెంట్. సాధారణ వెంటిలేటర్లలో ఉండే ఏఎంబీయూ బ్యాగులు కోవిడ్ పేషెంట్లలో ఉన్న ఊపిరితిత్తులకు నష్టం కలిగించేలా ఉంటాయి. అంతేకాకుండా రోగులకు చికిత్స చేసే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి కూడా వారి ద్వారా వైరస్ సోకే ప్రమాదముంది. నేను రూపొందించిన ఈ వెంటిలేటర్ కేవలం కోవిడ్ పేషెంట్ల చికిత్సకే కాకుండా ఇతర శ్వాసకోశ వ్యాధులతో చికిత్స తీసుకుంటున్నవారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. వెంటిలేటర్ తయారీకి తక్కువ సమయమే పట్టినా కొన్ని ప్రామాణికాల్ని పాటించాల్సి ఉంటుంది. వాణిజ్యపరంగా వెంటిలేటర్ ను తయారు చేసేందుకు కావాల్సిన పేటెంట్ హక్కుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేశాం. పేటెంట్ హక్కులొస్తే మరిన్ని వెంటిలేటర్లను తయారు చేస్తాం.'' అని విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : వావ్..మహేష్ యంగ్ లుక్, నెటిజన్లు ఫిదా

2014-2019 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ల నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైన విశ్వేశ్వర్ రెడ్డి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో విద్యనభ్యసించారు. తర్వాత అమెరికాలోని ఎన్జేఐటీ విద్యాసంస్థ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీర్ గా పట్టా అందుకున్నారు. అనంతరం విప్రో హెచ్సీఐటి లిమిటెడ్ , జనరల్ ఎలక్ట్రిక్ ఎంఎస్ఐటీ (జీఈ) లలో సీఈఓ గా మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు. ప్రస్తుతం స్టెఫాన్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్, ఏవీవీ టార్బైన్స్ లిమిటెడ్ కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు.

Next Story