టిమిండియాకు కోలుకోలేని షాకిచ్చిన న్యూజిలాండ్‌

By Newsmeter.Network  Published on  5 Feb 2020 10:43 AM GMT
టిమిండియాకు కోలుకోలేని షాకిచ్చిన న్యూజిలాండ్‌

టీ20 సిరీస్ ను కోల్పోయిన న్యూజిలాండ్‌ తమకు అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్‌ లో అదరగొట్టింది. హామిల్టన్‌ వేదికగా సెడాన్‌ పార్క్‌ లో జరుగుతున్న తొలి వన్డేలో 348 పరుగుల భారీ లక్ష్యాన్ని 48.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి చేధించింది. ఆ జట్టు సీనియర్‌ బ్యాట్స్ మెన్‌ రాస్ టేలర్‌(109 నాటౌట్ ;84బంతుల్లో 10పోర్లు, 4సిక్సర్లు), హెన్రీ నికోల్స్ (78; 82 బంతుల్లో 11 ఫోర్లు), టాప్‌ లేథమ్(69;48బంతుల్లో 8పోర్లు 2సిక్సర్లు) లు రాణించడంతో భారీ లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో కివీస్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

టీమిండియా నిర్ధేశించిన 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ కు ఓపెనర్లు మార్టిన్‌ గుప్టిల్ (32; 41బంతుల్లో 2 పోర్లు), హెన్రీ నికోల్స్ (78; 82 బంతుల్లో 11 ఫోర్లు) తొలి వికెట్‌ కు 85 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించారు. 32 పరుగులు చేసిన గుప్టిల్ ను శార్థుల్ ఠాకూర్‌ పెవియన్‌ కు పంపగా వన్‌డౌన్‌ లో వచ్చిన టామ్ బ్లుండెల్ (9; 10బంతుల్లో 1 పోర్‌) ను కుల్దీప్‌ ఔట్ చేశాడు. ఈ దశలో హెన్నీ నికోల్స్ కు సీనియర్‌ బ్యాట్స్ మెన్ రాస్ టేలర్ జత కలిసాడు. వీరిద్దరు సమయోచితంగా బ్యాటింగ్‌ చేశారు. విరాట్ కోహ్లీ మెరుపు ఫీల్డింగ్‌ తో 62 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.

కేన్‌విలియమ్‌సన్‌ గాయంతో తప్పుకోవడంతో తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన టామ్‌ లేథమ్.. అప్పటికే కుదురుకున్న టేలర్‌ కు జత కలిశాడు. టామ్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేయగా రాస్ ఆచితూచి ఆడాడు. టామ్‌ లేథమ్ ఔటైనా అప్పటికే జరగాల్సిన నష్టం జరిపోయింది. చివర్లో సాన్‌టర్న్ (12నాటౌట్ ;9బంతుల్లో 1పోర్‌ 1సిక్సర్‌)ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. టీ20ల్లో చేసిన పొరపాటును పునరావృతం కాకుండా టేలర్‌ చివరి వరకు క్రీజులో ఉండి కివీస్‌ కు విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో కుల్దీప్‌ 2వికెట్లు తీయగా.. షమి, శార్దూల్ ఠాకూర్‌ చెరో వికెట్ పడగొట్టాడు.

అంతకు ముందు టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ ముందుగా ఫీల్డిండ్‌ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్‌ కు దిగింది. టీమిండియా ఇన్సింగ్స్‌ ను పృధ్వీ షా, మయాంక్‌ అగర్వాల్ లు ఆరంభించారు. ఈ మ్యాచ్‌ ద్వారానే వీరిద్దరూ తొలి సారి పరిమిత ఓవర్ల క్రికెట్‌ లో అరగ్రేటం చేశారు. తొలి వికెట్ కు వీరిద్దరు 50 పరుగులు జోడించారు. అనంతరం పృథ్వీ షా(20; 21 బంతుల్లో 3 ఫోర్లు) ఔట్‌ కాగా, మరో నాలుగు పరుగుల వ్యవధిలో మయాంక్‌ అగర్వాల్‌ (32; 31 బంతుల్లో 6 ఫోర్లు) పెవిలియన్‌ చేరాడు. వన్‌డౌన్‌ లో వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(51; 63 బంతుల్లో 6 ఫోర్లు) సమయోచితంగా ఆడాడు. శ్రేయాస్‌ అయ్యర్ (103; 107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) తో కలిసి మూడో వికెట్ కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అర్థశతకం అనంతరం ఇష్‌ సోథీ బౌలింగ్‌ లో కోహ్లి బౌల్డ్‌ అయ్యాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతి కోహ్లి బ్యాట్‌ను దాటుకుని వెళ్లి వికెట్లను తాకింది.

Taylor's 109 helps New Zealand beat India

అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న శ్రేయాస్‌ కు పుల్‌ ఫామ్‌ లో ఉన్న కేఎల్‌ రాహుల్ (88 నాటౌట్‌; 64 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు) జతకలిసాడు. వీరిద్దరు ఆడితూచి ఆడుతూ.. చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. శ్రేయాస్‌ సింగిల్స్‌ తో స్ట్రైక్‌ రొటేట్‌ చేయగా రాహుల్ ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. 40 బంతుల్లోనే రాహుల్‌ అర్థశతం చేశాడు. ఆ వెంటనే అయ్యర్‌ తన వన్డే కెరీర్‌లో తొలి శతకాన్ని అందుకున్నాడు. 66 బంతుల్లో 5 ఫోర్లతో అర్థ శతకం పూర్తి చేసుకున్న అయ్యర్‌.. మరో 35 బంతుల్లో హాఫ్‌ సెంచరీని సెంచరీగా మలుచుకున్నాడు. రాహుల్‌-శ్రేయస్‌ అ‍య్యర్‌ల జోడి 136 పరుగులి భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత అయ్యర్‌ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. చివర్లో కేదార్‌ జాదవ్‌ ( 26 నాటౌట్‌; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో సౌతీ రెండు వికెట్లు సాధించగా, గ్రాండ్‌ హోమ్‌, ఇష్‌ సోథీలకు చెరో వికెట్‌ తీశారు.

కివీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన రాస్‌ టేలర్‌ కు ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

Next Story