గత వారం రోజుల నుంచి భారీ వర్షాలతో తెలంగాణ అతలకుతలం అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముఖ్యంగా హైదరాబాద్‌ నగరమంతా నీటితో నిండిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చి జల దిగ్బంధమయ్యాయి. భారీ వర్షాల కారణంగా ప్రాణ నష్టంతో పాటు ఆస్తినష్టం కూడా బాగా సంభవించింది. ఇప్పటికి చాలా ఇళ్లు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తెలంగాణ రాష్ట్రానికి సాయం అందించారు. తెలంగాణకు రూ.10 కోట్ల సాయం ప్రకటించారు.

ఈ సాయం తక్షణమే తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కు ట్రాన్స్‌ ఫర్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కుటుంబాలకు దుప్పట్లు, ఇతర వస్తువులను సైతం పంపించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కష్ట సమయంలో తెలంగాణకు తమిళనాడు ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని పళనిస్వామి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కోరితే ఇతర ఏ సాయంనైనా చేయడానికి తమిళనాడు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పళనిస్వామి లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి రూ.10 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించినందుకు కేసీఆర్‌ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. సాయం అందించేందుకు ఎంతో ఉదారతతో ముందకు వచ్చిన సీఎం, ఆ రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

మరో వైపు హైదరాబాద్‌లో వరదలకు నష్టపోయిన కుటుంబాలకు నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వరదలకు దెబ్బతిన్న కుటుంబాలకు రూ.10 వేల చొప్పున తక్షణ సాయం ప్రకటించారు. అలాగే వర్షానికి పూర్తిగా కూలిపోయిన ఇళ్లకు లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్నవాటికి రూ.50వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటిచారు. ఈ సాయాన్ని కూడా తక్షణమే అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

సుభాష్

.

Next Story