మన తెలుగోళ్లకు పక్క భాష చిత్రాలంటే బాగా మోజు. అందుకేనేమో తమిళ హీరోల్లో చాలామంది టాలీవుడ్ మార్కెట్ పై ఎప్పటికప్పుడు యుద్ధం చెయ్యటానికి డబ్బింగ్ చిత్రాలతో తెగ హడావుడి చేస్తూనే ఉంటారు. ప్రతి చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేరోజు విడుదల ప్లాన్ చేస్తారు. దాంతో తెలుగు స్టార్ హీరోల సినిమాలు కంటే కూడా.. తమిళ్ స్టార్ హీరోల సినిమాలే తెలుగు రాష్ట్రాల్లో తరచూ రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ 2020లో కూడా తమిళ్ స్టార్ హీరోలు వరుస సినిమాలతో టాలీవుడ్ పై కలెక్షన్స్ కోసం దండయాత్ర చేయనున్నారు.

ఇప్పటికే ‘దర్బార్’ సినిమాతో సూపర్ స్టార్ రజనీకాంత్ సంక్రాంతికి బాక్సాఫీస్ ఓపెన్ చేసేశాడు. పైగా శివ డైరెక్షన్లో చేస్తున్న కొత్త సినిమా ఈ దసరాకి రిలీజ్ చేస్తున్నాడు. అలాగే మరో స్టార్ విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘మాస్టర్’ సినిమా కూడా ఏప్రిల్ నెలలో రాబోతుంది. ఇక తెలుగులో పెద్దగా మార్కెట్ లేని తమిళ్ స్టార్ హీరో అజిత్ కూడా తన నూతన సినిమా ‘వాలిమై’ దీపావళి కానుకగా విడుదల చేస్తున్నాడు.

ఇక హీరో సూర్య, సుధా కొంగరల ‘సూరరై పొట్రు’ ఏప్రిల్ నెలలో, మరో టాప్ హీరో విక్రమ్ భారీ బడ్జెట్ సినిమా ‘కొబ్రా’ మే చివరన, కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో ధనుష్ చేస్తున్న ‘జగమే తంతిరమ్’, శింబు యొక్క ‘మానాడు’ ఈ సంవత్సరంలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఏమైనా… తెలుగు స్టార్ హీరోల సినిమాలు కంటే కూడా.. తమిళ స్టార్ హీరోల సినిమాలే టాలీవుడ్ లో ఎక్కువుగా హడావుడి చేస్తున్నాయి.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.