కరోనా ఎఫెక్ట్‌.. తాజ్‌ మహల్‌ మూసివేత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2020 1:50 PM GMT
కరోనా ఎఫెక్ట్‌.. తాజ్‌ మహల్‌ మూసివేత

ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్‌ మహల్ ఒకటి. కరోనా వైరస్‌(కొవిడ్‌-19) విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టారు. భారత్‌లో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 127కి చేరింది. ముగ్గురు మృత్యువాత పడ్డారు. కరోనా వైరస్‌ ఉదృతి నేపథ్యంలో మార్చి 31 వరకు దేశంలోని పాఠశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక జన సంచారం అధికంగా ఉండే సినిమా థియేటర్లు, వ్యాయామశాలలు, మ్యూజియంలు, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలు, ఈతకొలనులు మూసివేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి తాజ్‌ మహల్‌ సందర్శనను నిలిపివేస్తున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

'కరోనా వ్యాప్తి దృష్ట్యా టిక్కెట్లు ద్వారా ప్రవేశించే అన్ని చారిత్రక కట్టడాలు, అన్ని స్మారక చిహ్నాలు, కేంద్ర మ్యూజియాలను, ఎర్రకోట, తాజ్‌ మహాల్‌ మార్చి 31 వరకు మూసివేస్తున్నాం. దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం’ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ ప్రకటించారు. తాజాగా భారత ప్రభుత్వం ఐరోపా సమాఖ్యలోని దేశాలతో సహా టర్కీ, బ్రిటన్‌ల నుంచి వచ్చే పర్యాటకుల ప్రవేశాన్ని కూడా బుధవారం నిషేదించింది.

కాగా తాజ్‌ మహల్‌ మూతపడటం ఇది మూడోసారి. మొదటి సారి 971లో పాకిస్తాన్‌తో యుద్ధ సమయంలో.. అలాగే 1978లో వరదల నేపథ్యంలో రెండో సారి కొన్ని రోజుల పాటు సందర్శనను నిలిపి వేశారు.

Next Story