త‌హ‌శీల్దార్ హ‌త్య‌కు..భూ రికార్డుల ప్ర‌క్షాళ‌న‌కు లింకేంటి?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 6:36 AM GMT
త‌హ‌శీల్దార్ హ‌త్య‌కు..భూ రికార్డుల ప్ర‌క్షాళ‌న‌కు లింకేంటి?

తెలంగాణ రెవెన్యూది మార్ట్వాడ సిస్టమ్. ఆంధ్రది మద్రాస్ ప్రెసిడెన్సీ సిస్టమ్. తెలంగాణ భూ అంశాలకు సంబంధించి సర్వేనే అత్యంత పెద్ద టాస్క్. నిజాం కాలంలో కొనసాగిన జగిర్డార్, జమిందార్, మక్తలు, సర్పేఖాస్, వక్ఫ్, దేవాదాయ భూముల్లో ఒకరు రికార్డుకు ఉంటే... మరొకరు కబ్జాకు ఉన్నారు. పూర్వ కాలంలో వెట్టి చాకిరి చేసిన అనేక మంది ఈ భూములను సాగు చేసుకుంటున్నారు.

ఐతే ...తాజాగా ప్రభుత్వం భూ సర్వే చేయకుండా... సర్కారు పహనిలో అనుభవదారు కాలాన్ని ఎత్తేసింది. ఇలా తీసివేయడం వల్ల భూమిని సాగు చేసుకుంటున్న వారికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఐనప్పటికీ ఇలాంటి భూములను తహశీల్దార్ సర్వేయర్, వీఆర్వోల ద్వారా పంచనామా చేసి కేవలం తెల్ల కాగితం ఉన్నా... కబ్జా లో ఉండి భూమి కొనుగోలు చేసినట్లు ఎవరైనా సాక్షులు చెప్పినా త‌హ‌శీల్దార్‌ వారిని రికార్డులకు నమోదు చేయాల్సి ఉంటుంది. ఐతే ఇక్కడే అసలు తిరకాసు వచ్చింది.

ప్రభుత్వం ఎలాగో పహనిలోని కాలం నెంబర్ 13ను ఎత్తివేసింది. అంతే కాక కొత్తగా రైతులకు ఇస్తున్న పాస్ బుక్ లో కూడా సాగుదారు కాలం లేదు. పహని లో ఎంజాయ్‌మెంట్‌ కాలం పెట్టినప్పటికీ... దానికి మంగళం పాడేస్తున్నారు. అసలు భూమి ఎవరి ఆధీనం లో ఉందో సర్వే లేకుండానే.. అనుభవదారు కాలాన్ని ఎలా ఎత్తివేసిందనేదే అత్యంత బాధాకరమైన అంశం.

ఇక సర్కార్ ఎప్పుడైతే కబ్జా కాలం తీసివేసిందో... అప్పుడే క్షేత్ర స్థాయి లో తహశీల్దార్లు కొంత కీలకంగా మారారు. కబ్జా లో ఒక్కరూ ఉండి... రికార్డుకు మరొకరు ఉంటే మొదట వాటిని బి లిస్టులో చేర్చాలి. ఆ తర్వాతే ఆ భూములకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తారు. సర్వేయర్, వీఆర్వో,ఎంఆర్ ఐల‌ నివేదికల ఆధారంగా రికార్డులను మార్చాలి. కానీ.. రెవెన్యూ అధికారులు ప్రభుత్వం కబ్జా కాలం తీసివేయడంతో.. వారికి అనుకూలంగా ఉన్న వారి పేర్లను రికార్డులకు నమోదు చేసేస్తున్నారు. ఒకవేళ వారు కబ్జాకు అనుకూలంగా ఉన్న వారిని రికార్డుకు నమోదు చేయాలనుకుంటే.. వీఆర్వోల నివేదికల ఆధారంగా చేర్చుకున్నారు. అలాకాక పట్టే దారు పేరును రికార్డుల్లో కొనసాగించాలి అనుకుంటే... వీఆర్వోల నివేదికలు లేకుండా పనులు చేస్తున్నారు. ఇందుకోసం సదరు పార్టీలతో బేరాలు కుదుర్చుకొని రికార్డుల మార్పిడి చేస్తున్నారు.

అసలు ఈ మొత్తం సమస్యకు ప్రభుత్వ నిర్ణయం ఓ కారణం కాగా.... స్థానిక రెవెన్యూ అధికారుల చేతివాటం కూడా ముమ్మాటికీ కారణమనే చెప్పాలి. అసలు విజయారెడ్డి.. సురేష్ భూమి విషయంలో ఎలా స్పందించింది అనేది విచారణలో బయట పడుతుంది. కానీ, ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలకు ఫుల్‌ స్టాప్ పెట్టాలంటే.. రెవెన్యూ అధికారులపై నిఘా పెట్ట డడంతో పాటు.. తాను తీసుకున్న నిర్ణయాన్ని సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story