భారీ బాంబు పేలుడు.. 40 మంది మృతి
By సుభాష్ Published on 29 April 2020 11:19 AM IST
ఉత్తర సిరియాలో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఆఫ్రికన్‌లో మంగళవారం సంభవించిన ఈ భారీ బాంబు పేలుడులో 40 మంది మృతి చెందగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది పిల్లలున్నట్లు గుర్తించారు. పేలుడు సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ పేలుడు బీభత్సానికి కుర్ధిష్ వైపిజి మిలలీషియా సంస్థ కారణమని టర్కీ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు.
ఆఫ్రికన్ కేంద్రంగా రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ పేలుడు జరిగినట్లు మంత్రిత్వశాఖ ట్విట్టర్‌లో వెల్లడించింది. ఈ దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ ఘటనపై ప్రకటన విడుదల చేశారు. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు.
ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతమంతా భయానకరంగా మారింది. కార్లు, బైక్‌లు, ఇతర వాహనాలు, షాపులు పేలుడులో పూర్తిగా దగ్ధమయ్యాయి. మరింత పేలుడు జరిగే విధంగా ట్రక్కులు ఉపయోగించినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లచెదురై గుర్తుపట్టని విధంగా మాంసపు మద్దల్లా మారిపోయాయి. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని, వారికి అవసరమైన రక్తాన్ని అందించేందుకు ముందుకు రావాలని మంత్రిత్వశాఖ కోరింది.