‘సైరా’ ఎఫెక్ట్ : ఎస్సైలు డ‌్యూటీలు వదిలి సినిమాకు.. ఎస్పీ ఆగ్రహం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Oct 2019 1:06 PM ISTమెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమా ఇవాళ దేశవ్యాప్తంగా విడుదల అయ్యింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేశారు. మెగా అభిమానులంతా సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. కాగా సైరా సినిమా థియేటర్ లో చూద్దామని కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్లలోని థియేటర్ కు ఆరుగురు ఎస్సైలు వెళ్లి సినిమా చూశారు.
అయితే విధుల్లో ఉండి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సినిమాకు వెళ్లడంపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాకు వెళ్లిన ఆరుగురు ఎస్సైలపై చర్యలు తీసుకున్నారు. డ్యూటీలో ఉండి సినిమాకు ఎలా వెళ్తారంటూ పై అధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే వారిని వీఆర్ కు బదిలీ చేస్తున్నట్లు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. అవుకు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, కొలిమిగుండ్ల ఎస్సై జగదీశ్వర్ రెడ్డి, నందివర్గం ఎస్సై హరిప్రసాద్, బండి ఆత్మకూరు ఎస్సై వెంకట సుబ్బయ్య, రాచర్ల ఎస్సై ప్రియతంరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అశోక్ లను వీఆర్ కు బదిలీ చేశారు.