విమానాశ్రయంలో బాంబు కలకలం.. పేలుడు పదార్థాలు స్వాధీనం

By సుభాష్  Published on  20 Jan 2020 12:56 PM GMT
విమానాశ్రయంలో బాంబు కలకలం.. పేలుడు పదార్థాలు స్వాధీనం

కర్ణాటకలోని మంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం రేపింది. ఎయిర్‌పోర్టులో టికెట్‌ కౌంటర్‌ వద్ద అనుమానస్పద బ్యాగ్‌ను గుర్తించిన పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే టికెట్‌ కౌంటర్‌ వద్దకు చేరుకున్న నగర పోలీసు బాంబు స్వ్కాడ్‌ బ్యాగులో పేలుడు పదార్థాలున్నట్లు గుర్తించారు. ఆ బ్యాగును థ్రెట్‌ కంటైన్మెంట్‌ వాహనంలో కిలోమీటర్‌ దూరంలో కెంజార్‌లోని బహిరంగ ప్రదేశానికి తీసుకెళ్లి పరిశీలించారు. అందులో మెటల్‌ కాయిన్‌ బాక్స్‌ , పేలుడు పదార్థం, లోహపు ముక్కలున్నట్లు పోలీసులు తెలిపారు.

విమానాశ్రయంలో హైఅలర్ట్‌

ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో హై అలర్ట్‌ ప్రకటించారు. సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించిన అధికారులు.. నిందితుడి ఫోటోలను విడుదల చేశారు. అలాగే నిందితుడు వెళ్లిన ఆటోరిక్షా ఫోటోను కూడా విడుదల చేశారు. నిందితుడు పేలుడు పదార్థాలున్న బ్యాగును మంగళూరు ఎయిర్‌పోర్ట్ లో ఉంచి, ముఖాన్ని ఎవ్వరికి కనిపించకుండా దాచుకుంటూ ఆటోలో ఎక్కి పరారైనట్లు సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ డీఐజీ పాండే తెలిపారు. సీసీటీవీ పుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అన్ని విమాన సర్వీసులు కూడా టైమ్‌ ప్రకారమే నడుస్తున్నాయని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.

Next Story