రియా చక్రవర్తి మిస్సింగ్ అంటుండగానే.. సుప్రీం కోర్టులో పిటీషన్..?
By సుభాష్ Published on 30 July 2020 1:59 AM GMTసుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణమంటూ సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో రియా చక్రవర్తిపై కేసును సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు చేశారు. కేకే సింగ్ ఫిర్యాదు మేరకు సుశాంత్ సూసైడ్‌కు సహకరించిందని, అలాగే చీటింగ్, కుట్ర ఆరోపణలపై పోలీసులు రియా చక్రవర్తిపై కేసును నమోదు చేశారు.
పాట్నా నుంచి నలుగురు పోలీసుల బృందం రియాను విచారించేందుకు మంగళవారం ముంబైకి చేరుకుంది. ముంబైలోని రియా చక్రవర్తి ఇంటికెళ్లగా.. రియా లేనట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ముందస్తు బెయిల్ తీసుకునే ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. రియా ఇప్పటివరకు పోలీసులకు టచ్ లోకి రాలేదని తెలుస్తోంది. ముంబై చేరుకొన్న బీహార్ పోలీసులు నగరంలోని దర్యాప్తు బృందాలతో భేటి అయ్యారు. బుధవారం ఉదయం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులను బీహార్ పోలీసులు కలుసుకొన్నారు. బీహార్ పోలీసులకు కేసు డైరీని అందించడమే కాకుండా ఓ మహిళా కానిస్టేబుల్ కూడా వారితో పంపించారు.
పాట్నాలో దాఖలైన కేసును ముంబైకి ట్రాన్స్‌ఫర్ చేయాలని రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. రియా తరఫున ఆమె లాయర్ సతీష్ మాన్ షిండే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును ముంబై పోలీసులు ఇదివరకే విచారిస్తున్నారని, తనతో సహా మరికొందరు వారికి వాంగ్మూలం కూడా ఇచ్చామని ఆమె కోర్టుకు తెలిపారు. ఒకే ఘటనపై రెండు ఇన్వెస్టిగేషన్లు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. విచారణలో ముంబై పోలీసులకు తను సహకకరిస్తూనే ఉన్నానన్నారు. బీహార్ పోలీసులు ఆమెపై పెట్టిన ఎఫ్ ఐ ఆర్ విచారణను నిలిపివేసేలా చూడాలని సతీష్ మాన్ షిండే అత్యు న్నత న్యాయస్థానాన్ని కోరారు.
సుశాంత్ ఫ్యామిలీ అడ్వకేట్ వికాస్ సింగ్ మాత్రం రియాను అరెస్ట్ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ కేసులో రియా చక్రవర్తిని అరెస్ట్ చేయాలి. అతి త్వరలో జరిగే అవకాశాలు కనబడుతున్నాయనే ఆశాభావాన్ని వికాస్ సింగ్ వ్యక్తం చేశారు. ఈ కేసులో అరెస్టులు జరిగితేనే అసలు విషయాలు బయటకు వస్తాయి. అప్పడే ఈ కేసుకు, సుశాంత్‌కు న్యాయం జరుగుతుంది అని వికాస్ సింగ్ అన్నారు.
రియా నా కుమారుడిని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధించింది అని సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు పాట్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రియాతోపాటు మరో ఐదుగురు సుశాంత్ స్నేహితులపై కేసు నమోదు చేయడం గమనార్హం. ఐపీసీ సెక్షన్ 306, 340, 342, 380, 406, 420 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారని పాట్నా సెంట్రల్ జోన్, ఐఐజీ సంజయ్ సింగ్ ధృవీకరించారు. తన కుమారుడికి స్వయంగా వైద్యం చేసి ముప్పులో పడేసింది. ఓవర్‌డోస్ మెడిసిన్ష్ ఇచ్చి మరణానికి కుట్ర పన్నిందని ఆరోపణలు గుప్పించారు. ఇంటిలోని విలువైన వస్తువులను రియా, ఆమె కుటుంబ సభ్యులు తీసుకెళ్లారని.. నగలు, డబ్బు అంతా మాయం చేశారని సుశాంత్ కుటుంబం చెబుతోంది. సుశాంత్ ఫోన్ తన వద్దే పెట్టుకొని ఫ్యామిలీకి అందుబాటులో లేకుండా చేసిందని కేకే సింగ్ ఫిర్యాదు చేశారు.