సూర్యాపేటలో దారుణం.. టీఆర్‌ఎస్‌ నేత దారుణ హత్య

By సుభాష్  Published on  15 Feb 2020 3:18 AM GMT
సూర్యాపేటలో దారుణం.. టీఆర్‌ఎస్‌ నేత దారుణ హత్య

తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా యార్కారం గ్రామంలో టీఆర్‌ఎస్‌ నాయకుడిని కాంగ్రెస్‌ వర్గీయులు దారుణంగా హత్య చేశారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ ఒంటెద్దు వెంకన్న సహకార సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ఓటర్లను కలుసుకొంటుండగా, శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దాదాపు 20 మంది కాంగ్రెస్‌ వర్గీయులు మారణాయుధాలతో వెంబడించారు. దీంతో వెంకన్న గ్రామానికి చెందిన అవుదొడ్డి వీరయ్య ఇంట్లో దాక్కోగా, వెంకన్నను కత్తులతో నరుకుతూ, బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. కాగా సమస్యాత్మక గ్రామమైన యార్కారంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ సహకార సంఘం ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు రెండో రోజుల కిందట గ్రామానికి చెందిన ఓటర్లను సూర్యాపేటలోని ఓ ఫంక్షన్‌ హాల్లో ఉంచగా, కాంగ్రెస్ వర్గీయులు అక్కడికి వెళ్లడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోగా, కాంగ్రెస్‌ వర్గీయులపై టీఆర్‌ఎస్‌ వర్గీయులు దాడికి దిగారు. కాగా, జరిగిన గొడవలను మనసులో పెట్టుకున్న టీఆర్‌ఎస్ వర్గీయులు సమయం చూసుకుని వెంకన్నను దారుణంగా చంపేశారు.

ఈ ఘటనలో కాంగ్రెస్‌ వర్గీయుడైన మిద్దె సైదులకు సైతం గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర్‌రావు పోలీసులతో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి భారీగా పోలీసులు చేరుకుని బందోబస్తు నిర్వహించారు. మరో వైపు సహకార సంఘం ఎన్నికల పోలింగ్‌ ఉదయం నుంచి ప్రారంభమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story