కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. కొంతమంది పోలీసులు ఇదే అదనుగా భావించి సామాన్యులపై రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ రైతుపై ఎస్సై తన ప్రతాపం చూపించాడు. తెలంగాణలోని సూర్యపేట జిల్లా కుడకుడలో ఈ ఘటన చోటు చేసుకుంది. పొలం దగ్గరకు వెళ్తున్న ఓ రైతును చివ్వెంల ఎస్సై విచక్షణరహితంగా చితకబాదాడు. భూమి పంచాయితీ విషయంలో ఎస్పీకి ఫిర్యాదు చేయడాన్ని మనసులో పెట్టుకున్న ఎస్సై లవకుమార్‌ లాక్‌డౌన్‌ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని రైతును చితకబాదినట్లు ఆ రైతు ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై సదరు రైతు తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నాడు.

లాక్‌డౌన్‌ సక్రమంగా అమలవుతోందని పోలీసుల కృషిని అందరూ అభినందిస్తున్నప్పటికీ.. కొందమంది పోలీసులు తీరు వివాదస్పదంగా మారుతుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలో మొన్న ప్రభుత్వ వైద్యుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. కుడకుడ గ్రామంలో జక్కలి వీరయ్య అనే రైతు ఉగాది పండగ సందర్భంగా పొలం వద్ద కొబ్బరికాయ కొట్టడాన్ని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, చివ్వెంల ఎస్సై లవకుమార్‌ అడ్డుకుని తీవ్రంగా చితకబాదాడు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

కాగా, గతంలో బాధితుడు వీరయ్య నూతన కలెక్టరేట్‌ భవన సమీపంలో తన భూమి పంచాయితీ విషయంలో లవకుమార్‌పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న ఎస్సై లవకుమార్‌ విచక్షణ రహితంగా కొట్టాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పొలం వద్దకు వెళ్తున్న నన్ను మార్గమధ్యంలో పట్టుకుని దొంగను కొట్టినట్లు తీవ్రంగా చితకబాదాడని వాపోయాడు. కాగా, రైతుల విషయంలో సీఎం కేసీఆర్‌ ఊదారంగా వ్యవహరిస్తుంటే.. ఎస్సై లవకుమార్‌ మాత్రం పాతకక్షలను మనసులో పెట్టుకుని ఇలా చితకబాదాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. తనకు సత్వరమే న్యాయం జరగాలని బాధితుడు కోరుతున్నాడు. కాగా, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు జరిగిన ఘటన పట్ల వెంటనే స్పందించారు. ఎస్సై లవకుమార్‌ను క్రమ శిక్షణ చర్యల కింద జిల్లా పోలీసు స్పెషల్‌ బ్రాంచ్‌కు బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్వర్వులు జారీ చేశారు.

సుభాష్

.

Next Story