తమిళ స్టార్ హీరో సూర్య గ‌జిని సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అందుక‌నే సూర్య‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉంది. తమిళంలో ఆయన హీరోగా తెరకెక్కే ప్రతి సినిమాను తెలుగులో డ‌బ్‌ చేసి రిలీజ్ చేస్తుంటారు. అయితే… ఈ మ‌ధ్య సూర్య స‌రైన స్క్రిప్ట్ ఎంచుకోక‌పోవ‌డం వ‌ల‌న స‌క్సెస్ సాధించ‌డం లేదు. ఈ ఏడాది సూర్య న‌టించిన‌ ‘ఎన్జీకే’, ‘బందోబస్త్’ ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. అందుకే ఈసారి ఎలాగైనా స‌క్సెస్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో సినిమా చేస్తున్నాడు.

విక్టరీ వెంకటేష్‌తో ‘గురు’ మూవీని తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నారు. తమిళంలో ‘సూరరై పోట్రు’ టైటి‌ల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళ ఫస్ట్‌లుక్ పోస్టర్లను హీరో సూర్య ట్వీట్ చేశారు. ‘‘అసాధారణమైన కలతో ఒక సాధారణ వ్యక్తి’’ అని సూర్య ట్వీట్‌లో తెలియ‌చేసారు.

సిఖ్యా ఎంటర్‌టైన్మెంట్ సౌజన్యంతో 2డి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజశేఖర్ కర్పూరపాండియన్, గునీత్ మోంగా, ఆలిఫ్ సూర్తి సహనిర్మాతలు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. కాళీ వెంకట్, కరుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న, కృష్ణ కుమార్ తదితరులు నటిస్టున్నారు. మ‌రి… ఈ సినిమాతో అయినా సూర్య‌కు స‌క్స‌స్ వ‌స్తుంద‌ని ఆశిద్దాం.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.