దాదా భవితవ్యం తేలేది అప్పుడే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2020 12:09 PM IST
దాదా భవితవ్యం తేలేది అప్పుడే..

బీసీసీఐ(భారత క్రికెట్‌ నియంత్రణ మండలి) రాజ్యాంగ సవరణ. అధ్యక్ష, కార్యదర్శుల పదవీ కాలం పొడగింపు సహా మరికొన్ని అంశాల పొడిగింపుపై బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. బుధవారం స్వల్ప వాదన అనంతరం ఆగస్టు17న (రెండు వారాల అనంతరం) విచారణ చేపడుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాజ్డే, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం తెలిపింది. కాగా.. అప్పటి వరకు బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా ఎప్పటిలాగే తమ విధులకు హాజరవుతారని సమాచారం.

బీసీసీఐ పరిపాలనలో మార్పుల కోసం నియమించిన లోధా కమిటీ గతంలో పలు సిఫారసులు చేసింది. ఆ సమయంలో వీటిని అమలు చేస్తామంటూ బీసీసీఐ తమ నియమావళిని కూడా సవరించింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో తమ నియమావళిలో మళ్లీ సవరణలు చేసేందుకు అనుమతించాలంటూ సుప్రీంకోర్టును బీసీసీఐ ఆశ్రయించింది. సుప్రీంకోర్టును బీసీసీఐ కోరుతున్న ప్రధాన అంశం 'కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌' గురించి. నిబంధనల ప్రకారం బీసీసీఐలోగానీ రాష్ట్ర క్రికెట్‌ సంఘాల్లోగానీ వరుసగా ఆరేళ్లు ఆఫీస్‌ బేరర్‌గా పని చేసినవారు ఆ తర్వాత కనీసం మూడేళ్ల పాటు ఎలాంటి పదవులు చేపట్టరాదు.

బోర్డు కార్యవర్గం ఏర్పడి పది నెలలు మాత్రమే అవుతోంది. అంతకముందు గంగూలీ, షా తమ రాష్ట్ర బోర్డుల్లో పదవీ బాధత్యల్లో ఉన్నారు. దాంతో కలిపి ఆరేళ్ల గడువు పూర్తి అవుతోంది. మేలో షా పదవీ కాలం ముగియగా.. జూలై 27తో దాదా గడువు ముగుస్తుంది. కాగా.. గత డిసెంబర్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో రాజ్యాంగంలో మార్పులు చేస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఇందులో అధ్యక్ష, కార్యదర్శుల పదవీకాలం నిబంధనలు సవరించారు. దానిని సుప్రీం కోర్టు ఆమోదం కోసం పంపించారు.

కాగా.. గంగూలీ, షా లు ఇద్దరు బోర్డు సమావేశాల్లో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. సుప్రీం విచారణ వాయిదా పడడంతో ఐపీఎల్‌ పాలక మండలి సమావేశంలోనూ వీరు పాల్గొంటారని తెలుస్తోంది.

Next Story