మ‌రో ప‌దిరోజుల్లో 'సుప్రీం' మూడు కీల‌క తీర్పులు.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌.!

By Medi Samrat  Published on  3 Nov 2019 8:50 AM GMT
మ‌రో ప‌దిరోజుల్లో సుప్రీం మూడు కీల‌క తీర్పులు.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌.!

ముఖ్యాంశాలు

  • ర‌ఫేల్ స్కాం తీర్పు కూడా ఈ నెల‌లోనే
  • శ‌బ‌రిమ‌ల‌లో మ‌హిళ‌ల ప్ర‌వేశంపై కూడా తీర్పు
  • 15నే గొగోయ్ చివ‌రి ప‌నిదినం

వారం రోజుల దీపావళి సెలవుల తరువాత సుప్రీంకోర్టు నవంబర్ 4న తిరిగి ప్రారంభంకానుంది. కోర్టు తిరిగి ప్రారంభమ‌వుతుండటంతో దేశ ప్ర‌జ‌లంద‌రి దృష్టి వివాద‌స్ప‌ద‌ 'రామ జన్మభూమి-బాబ్రీ మసీదు' భూవివాదంపైకి మ‌ళ్లింది. ఎటువంటి తీర్పు వెలువ‌డ‌నుందా.. అని అయోధ్య తీర్పుపైనే అందరి దృష్టి ఉంది. నవంబర్ 4 నుండి 15 వరకు కోర్టుకు ఎనిమిది పని దినాలు ఉండ‌టం చేత దేశ‌ ప్ర‌జానీకం అంతా ఏ రోజు తీర్పు వెలువ‌డ‌నుందో అని తీవ్ర ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా.. చాలామంది న్యాయ‌మూర్తులు వాద‌న‌లు విన్న ఈ అయోధ్య వివాదం ప‌రిష్కార కోణంలో.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ రంజన్ గొగోయ్, జ‌స్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్ మరియు జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ల‌తో కూడిన సుప్రీం ధ‌ర్మాస‌నం ఎటువంటి తీర్పును ప్రకటిస్తారు.. అనే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది.

నవంబర్ 17న సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గోగోయ్ పదవీ విరమణ చేస్తుండ‌టం.. నవంబర్ 15నే గొగోయ్ చివరి పని దినం కావ‌డం కూడా అయోధ్య‌ ఉత్కంఠ‌కు కార‌ణంగా చెప్పొచ్చు. అయితే.. కోర్టుకు సోమవారం నుండి శుక్రవారం వరకు(4 నుండి 8) ఐదు రోజులు.. తర్వాతి వారంలో మూడు రోజులు మాత్ర‌మే ప‌నిదినాలు ఉండ‌టం గ‌మ‌నార్హం.

అయోధ్య వివాదమే కాకుండా.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మ‌రో రెండు ముఖ్య‌మైన‌ కేసుల‌లో తీర్పులు కూడా ఈ నెల‌లోనే ఉండ‌టం విశేషం. రాఫెల్ యుద్ధ విమానాల కేసు, శ‌బ‌రిమ‌ల‌లోకి మహిళల ప్రవేశానికి అనుమతికి సంబంధించిన కేసుల‌లో కూడా కోర్టు ఈ నెల‌లోనే తీర్పులు ప్ర‌క‌టించ‌నున్న నేఫ‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా శీతాకాలంలోనే ఉక్క‌పోత ఛాయ‌లు క‌నిపిస్తున్నాయి.

Next Story