1526లో బాబ్రీ మసీదు కట్టారనుకుంటే..దాదాపు 134 ఏళ్ల నుంచి బాబ్రీ మసీదు – రామ మందిర్ వివాదం కొనసాగుతోంది. బ్రిటీష్ కాలంలో ప్రారంభమైన వివాదం..స్వాతంత్ర్యం తరువాత కూడా కనొసాగింది. 1885 నుంచి వివాదం నడుస్తుందని సుప్రీం కోర్ట్ కూడా అనుమతించింది. ఫైజాబాద్ కోర్ట్, జిల్లా అధికారుల దగ్గర వివరాలు చూస్తే 1885 నుంచి బాబ్రీ మసీద- రామ జన్మభూమి వివాదం నడుస్తుందని అర్ధమవుతుంది.

అయితే..1992, డిసెంబర్ 6 తరువాత ఈ సమస్య దేశ సమస్యగా మారిపోయింది. కరసేవకులు అని చెప్పుకునే కొంత మంది బాబ్రీ మసీద్‌ను కూల్చేశారు. దీనికి అద్వానీ రథయాత్ర కారణమని చెబుతారు. ఈ చర్య ఆనాడు దేశంలో అనేక ఉద్రిక్త పరిస్థితులకు చోటు కల్పించేలా చేసింది.

బాబ్రీ మసీదు ఉన్న స్థానం రామజన్మ భూమి అంటూ 1982లో విశ్వహిందూ పరిషత్ పెద్ద ఉద్యమాన్నే లేవదీసింది. 1989 భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశంలో దీనిపై తీర్మానం కూడా చేశారు. ఫైజాబాద్ సివిల్‌జడ్జి కె.ఎం.పాండే 1986 ఫిబ్రవరి 1వ తేదీన మందిరం తాళాలు తెరిపిస్తూ అజ్ఞలు ఇచ్చారు.

ఈ చర్యతో ముస్లింలు ఆగ్రహించారు. అఖిల భారత బాబ్రీ మసీదు కార్యాచరణను ప్రారంభించారు. ఈ సమయంలో రాజీవ్ ప్రభుత్వానికి, ముస్లింలకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే..నవంబర్9 1986న రామమందిరానికి శంకుస్థాపన చేసుకునేందుకు విశ్వహింద్ పరిషత్‌కు రాజీవ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ రోజు సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది కూడా నవంబర్‌ 9నే. ఇది కాకతాళీయమే అయినప్పటికీ…నవంబర్‌9 చరిత్రలో నిలిచిపోయింది.

రామ మందిరాన్ని బీజేపీ నినాదంగా తీసుకోవడంతో ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చింది. 1990లో అద్వానీ రథయాత్ర, 1992 బాబ్రీ కూల్చివేత పెద్ద దుమారాన్నే లేపాయి. అయితే..సంఘ్ పరివార్ మాత్రం ఒక వైపు న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు…ప్రజల్లో రామజన్మ భూమిపై ముందుకెళ్లింది.

నేడు సుప్రీం తీర్పుతో 134 ఏళ్ల వివాదానికి తెర పడినట్లైంది. మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్‌ ను ఏర్పాటు చేసి…2.27 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని ట్రస్ట్ అప్పగించాలని సుప్రీం ఆదేశించింది.

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.