హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్.!
By Newsmeter.Network
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్...పుట్టినరోజు ఈరోజు (డిసెంబర్ 12). అభిమానులకు ఈరోజు పండగ రోజు. సినీ, రాజకీయ ప్రముఖులు రజనీకాంత్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ గురించి క్లుప్తంగా మీ కోసం... రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఆయన 1950 డిసెంబర్ 12వ తేదీన కర్ణాటకలో జన్మించారు. ప్రాధమిక విద్యను బెంగుళూరులోనే చదువుకున్న రజనీకాంత్ 16 ఏళ్ల వయసు నుంచి ఉద్యోగం కోసం అన్వేషణ ఆరంభించారు.
రకరకాల చిన్న ఉద్యోగాలు చేసిన రజనీకాంత్ చివరకు బస్ కండక్టర్ ఉద్యోగంలో చేరారు. కండక్టర్ ఉద్యోగం చేస్తున్న టైమ్ లో రజనీ స్టైల్ చూసిన కొంత మంది మిత్రులు, సన్నిహితులు సినిమాల్లోకి వెళితే రాణిస్తావని చెప్పేవారట. ముఖ్యంగా రజనీకాంత్ స్నేహితుడు రాజ్ బహుదూర్ నీలో చక్కని నటుడు ఉన్నాడని ఎంతగానో ప్రొత్సహించాడట. అలా.. మిత్రులు ప్రొత్సాహంతో సినీ రంగంలో ప్రవేశించిన.. నటుడుగా అవకాశాలు కోసం ప్రయత్నిస్తున్న టైమ్ లో దర్శకుడు బాల చందర్ రజనీకాంత్ కి అపూర్వ రాగంగల్ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు.
తొలి చిత్రంతోనే తన నటనతో ఆకట్టుకున్నాడు రజనీకాంత్. ఆతర్వాత మూడు ముట్రిచ్చు, రఘుపతి రాఘవ రాజారాం, భువనా ఒరు కేల్విక్కురి, పదినారు వయదినేలే.. తదితర చిత్రాల్లో తనదైన స్టైల్ లో నటించి, పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. వచ్చిన పాత్ర హీరో పాత్రా, విలన్ పాత్రా అని చూడలేదు. వచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి..? ఆ పాత్రలో ఎలా మెప్పించాలి..? అనేదే ఆలోచించేవారట. బిల్లా సినిమాతో మాస్ ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఈ మూవీ ట్రెండ్ సెట్టర్ గా నిలిచి విమర్శకుల నోళ్లు మూయించింది. అణ్ణామలై, పాండియన్, భాషా, ముత్తు, వడయప్పా, బాబా, రోబో, శివాజీ చిత్రాలతో అయితే.. చరిత్ర సృష్టించారు.
కబాలి, కాలా చిత్రాలు ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోకపోవడంతో ఇక సినిమాలకు స్వస్తి చెబితే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేసారు. అయితే.. పేట సినిమాతో కమర్షియల్ సక్సస్ సాధించారు. తాజాగా దర్బార్ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు సూపర్ స్టార్. మరో వైపు రాజకీయల్లో ఎంట్రీ ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నారు. ఎంత మంది హీరోలు వచ్చినా.. రజనీ స్టైలే వేరు. దర్బార్ తో వస్తున్న రజనీ మరిన్ని సినిమాలు చేయాలని... మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ & హ్యాపీ బర్త్ డే టు సూపర్ స్టార్ రజనీకాంత్.