వేసవి మనల్ని కాపాడనుందా ?

చైనాతో సహా 90 దేశాల్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ (కోవిడ్ 19) ఇప్పుడు ఇండియాలోకి కూడా ప్రవేశించింది. ఇతర దేశాల నుంచి వస్తోన్న వారి ద్వారానే ఈ వైరస్ మన దేశంలోకి చొరబడింది. ముఖ్యంగా ప్రాజెక్ట్ పనులమీద దుబాయ్, సింగపూర్, జర్మనీ, ఇటలీ ఇలా వివిధ దేశాలకు వెళ్లి వచ్చిన వారికి కరోనా లక్షణాలుండటంతో వారిని నుంచి రక్తనమూనాలను సేకరించి ఐసోలేషన్ వార్డుల్లో చికిత్సనందిస్తున్నారు. చైనాలో ఈ వైరస్ అంతలా వ్యాపించడానికి ముఖ్య కారణం వాతావరణమేనట.

డిసెంబర్ లో అంటే..దాదాపుగా శీతాకాలంలోనే వచ్చిన ఈ వైరస్..అక్కడి వాతావరణ పరిస్థితులు తనకు అనుకూలంగా ఉండటంతో శరవేగంగా వ్యాప్తి చెందింది. ఇప్పటి వరకూ ఈ వైరస్ బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోగా..లక్షల మంది ఇంకా ఆస్పత్రుల బెడ్లకే పరిమితమయ్యారు. కాగా..ఇతర దేశాలతో పోల్చుకుంటే..మనదేశంలో కరోనా ప్రభావం కాస్త తక్కువగా ఉందనే చెప్పాలి. ఇందుకు కారణం ఇక్కడ వేడి ఎక్కువగా ఉండటమే అంటున్నారు వైద్యులు. కొత్తగా వచ్చిన ఈ వైరస్ ను అరికట్టేందుకు కేవలం అధిక ఉష్ణోగ్రత ఒక్కటే సహాయపడగలదని తెలిపారు.

కరోనా వైరస్ గురించి ఆర్ఎన్ ఠాగూర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ (RTIICS) క్రిటికల్ కేర్ హెడ్ సౌరెన్ పంజా జాతీయ మీడియాతో మాట్లాడుతూ..మన దేశంలో వైరస్ దాడులను నియంత్రించగలిగే ఏకైక ఖచ్చితమైన ఆయుధం వాతావరణం ఒక్కటేనని పేర్కొన్నారు. nCov భౌగోళిక వ్యాప్తి ఇప్పటివరకు శీతల వాతావరణం ఉన్న దేశాలకు మాత్రమే పరిమితం చేయబడిందని సౌరెన్ చెప్పుకొచ్చారు.

చైనాలోని వుహాన్ లో గడిచిన రెండు నెలల్లో గరిష్ట సంఖ్యలో కేసులు నమోదయ్యాయంటే..ఇక్కడ జనవరి, ఫిబ్రవరి రెండింటిలో సబ్-జీరో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలుస్తోంది. దీని కారణంగానే అక్కడ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందింది. అలాగే ఇటలీలోని రోమ్, ఇరాన్‌లోని టెహ్రాన్‌లో కూడా ఫిబ్రవరిలో సబ్-జీరో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ భారత్ లో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచే కొన్ని ప్రాంతాల్లో 35 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

కేవలం కరోనా నే కాదు..గతంలో అమెరికా, ఆఫ్రికా, ఆస్ర్టేలియాల్లో వేలాదిమందిని పొట్టనబెట్టుకున్న MERS, SARS, ఎబోలా ఎల్లో జ్వరం లాంటి అంటువ్యాధులు కూడా భారత్ లో చాలా తక్కువ ప్రభావాన్ని చూపించాయి. అప్పుడు కూడా ఈ వైరల్ వైరస్ ల ఆటకట్టించింది అధిక ఉష్ణోగ్రతే. ఈ తరహా వాతావరణంలో ప్రాణాంతక వైరస్‌లు మనుగడ సాగించడం శక్తివంతంగా మారడం కష్టమేనని చెప్పవచ్చు.

దేశంలోని పెద్దవాళ్లల్లో న్యుమోనియా అధికంగా ఉండటం అసలు కరోనావైరస్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని అంటున్నారు. SARS-CoV-2 న్యుమోనియా వేగంగా అభివృద్ధి చెందుతున్న అన్ని కేసులను పరీక్షించాలని అగర్వాల్ సూచిస్తున్నారు. అంతేకాకుండా, ఫిబ్రవరిలో 23 నుండి 33 ° C మధ్య ఉష్ణోగ్రతలు పెరిగిన సింగపూర్ వంటి దేశాలలో 110 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అందువల్ల..కొత్త కరోనావైరస్‌ను అరికట్టడానికి అధిక ఉష్ణోగ్రత మాత్రమే సహాయపడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.