ఈ ఎండాకాలం తెలంగాణ వాసులకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించబోతోంది. శివరాత్రికి చలి శివశివా అనుకుంటూ పోతుందని మనవాళ్లు చెబుతారు. కానీ ఈ సారి శివరాత్రి కన్నా చాలా ముందే చలి వెళ్లిపోయింది. ఇప్పటికే మద్యాహ్నాలు మండిపోతున్నాయి. చెమటలు కారిపోతున్నాయి. తలలు మాడిపోతున్నాయి. ఇంకా ఎండాకాలం రాకుండానే ఇలా ఉంటే ఇక ఎండాకాలం వస్తే ఎలా ఉంటుంది? అందుకే సమ్మర్ వస్తోంది జాగ్రత్త అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు.

ఈ ఏడాది మామూలుకన్నా చాలా వేడిగా ఉండబోతోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నిజానికి ఈ చలికాలం గత అనేక సంవత్సరాల కన్నా తక్కువ చలి ఉందని, కాబట్టి ఈ వేసవి గత దశాబ్దంలోనే అత్యధిక వేడిమితో కూడి ఉండబోతోందని హైదరాబాద్ లోని భారతీయ వాతావరణ విభాగం శాస్త్రవేత్త బి. రాజారావు అంటున్నారు. ఈ చలికాలం రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుంచి 30 డిగ్రీల సెల్సీయస్ వరకూ ఉన్నాయని, ఇది చలికాలంలో సగటు రాత్రి ఉష్ణోగ్రతల కన్నా కనీసం మూడు డిగ్రీలు ఎక్కువని ఆయన అన్నారు. జనవరి నెల నుంచి మామూలు పగలు ఉష్ణోగ్రతల కన్నా మూడు డిగ్రీలు ఎక్కువని కూడా ఆయన చెప్పారు. ఫిబ్రవరి నెలాఖరుకు వాతావరణం మరింత వేడెక్కుతుందని ఆయన అన్నారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి తెలంగాణలోని జిల్లాల్లోని పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ వరకూ వెళ్లవచ్చునని ఆయన అంటున్నారు.

ఇప్పటికే తెలంగాణ లోని వివిధ జిల్లాల్లో వాతావరణం వేడెక్కిపోయి ఉంది. మొత్తం 33 జిల్లాల్లో 28 జిల్లాల్లో ఉష్ణోగ్రలు పెరిగాయి. మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే 37.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. పెద్దపల్లి జిల్లాల్లో 37.7 డిగ్రీలు, వికారాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, జగిత్యాల, కొత్తగూడెంలలో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం రోజు హైదరాబాద్ లో 32.7 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాబట్టి గొడుగులు, నల్ల కళ్లద్దాలు రెడీ చేసుకొండి. మూతికి తువాళ్లు బిగించుకొండి… బోల్డన్ని జ్యూసులు, కూల్ డ్రింకులు తాగండి…. !!

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.