సుశాంత్‌.. 'సూసైడ్‌ ఆర్‌ మర్డర్‌' ఫస్ట్‌లుక్‌ విడుదల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 July 2020 10:14 AM GMT
సుశాంత్‌.. సూసైడ్‌ ఆర్‌ మర్డర్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని ఆయన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుశాంత్‌ మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇక సుశాంత్ ది ఆత్మహత్య కాదని, హత్య చేశారంటూ వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు సుశాంత్‌ మృతిపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ మృతిపై బాలీవుడ్ నిర్మాత విజయ్‌ శేఖర్‌ గుప్తా.. 'సూసైడ్‌ ఆర్‌ మర్డర్‌' పేరుతో ఓ చిత్రాన్ని తీయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ మూవీలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ డూప్‌ అయిన సచిన్‌ తివారీ నటిస్తున్నాడు.

ఓ చిన్న టౌన్‌ నుంచి వచ్చిన సుశాంత్ ఎలా స్టార్‌ హీరోగా ఎదిగాడు అనేది చిత్ర కథాంశం. అసలు సుశాంత్‌ బాలీవుడ్‌కు ఎలా పరిచయం అయ్యాడు.? ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడానికి గత కారణాలు ఏంటీ..? అనే పలు కీలక అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. అంతేకాకుండా బాలీవుడ్‌ నెపోటిజంపై వ్యంగ్యంగా విమర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఫస్ట్ లుక్ ను ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఓటీటీ ప్లాట్‌ఫాం వీఎస్జీ బింగే పేజిలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా విజయ్‌ శేఖర్‌ గుప్తా.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ ను సెప్టెంబర్‌ 16 నుంచి ప్రారంభిస్తామని, ఇప్పటికే చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్‌ 50 శాతం పూర్తయిందన్నారు. ముంబై, పంజాబ్‌, బీహార్‌ ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు చెప్పారు.

Next Story