ప్రేమ విఫలం: వాలెంటైన్స్‌ డే ముందు రోజే యువకుడి ఆత్మహత్య

By సుభాష్  Published on  14 Feb 2020 5:10 AM GMT
ప్రేమ విఫలం: వాలెంటైన్స్‌ డే ముందు రోజే యువకుడి ఆత్మహత్య

ప్రేమికుల ముందు రోజే విషాదం చోటు చేసుకుంది. ఎంతో ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలికి పెళ్లి అవుతుందని తెలుసుకున్న ప్రేమికుడు వాలెంటైన్స్‌ డే ముందు రోజు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర సంచలనంగా మారింది. వారిద్దరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. యువతికి వేరేవ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో యువకుడు తట్టుకోలేకపోయాడు. యువతికి గురువారమే పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న ప్రేమికుడు పెళ్లి రోజే ఆత్మహత్యకు పాల్పడడ్డాడు. ఈ విషాద ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది.

కొందుర్గు మండలానికి చెందిన విజయ్‌ (25) అనే యువకుడు షాద్‌నగర్‌ సమీపంలోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. స్థానికంగా ఓ యువతి ప్రేమలో పడ్డాడు. ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో తల్లిదండ్రులు వేరే వ్యక్తితో పెళ్లి కుదిర్చారు. గురువారం పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రియురాలుకు వేరే వ్యక్తితో వివాహం జరుగుతుందన్న విషయం తెలుసుకున్న విజయ్‌ కంపెనీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రాయినా కుమారుడు ఇంటికి రాకపోవాడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది చుట్టుపక్కల వెతికారు. అయినా దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, గురువారం షాద్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో యువకుతి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు హుటాహుటిన కాచిగూడ రైల్వేస్టేషన్‌కు చేరుకుని పరిశీలించారు.యువకుడి షర్టు జేబులో ఉన్న ఆధార్‌ కార్డు ఆధారంగా విజయ్‌గా గుర్తించారు. వెంటనే పోలీసులు కుటుంబీకులకు సమాచారం అందించారు. కాగా, గురువారం తెల్లవారుజామున పురుగుల మందు సేవించి పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మృతదేహాన్ని షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ విఫలం కావడంతోనే విజయ్‌ గత కొద్ది రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడని, కాని ఇలాంటి దారుణానికి పాల్పడతాడని అనుకోలేదని తల్లిదండ్రులు, మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it