'కుషాల్ పంజాబీ' ఆత్మహత్య – ఇండస్ట్రీకి షాక్

By Newsmeter.Network  Published on  28 Dec 2019 7:53 AM GMT
కుషాల్ పంజాబీ ఆత్మహత్య – ఇండస్ట్రీకి షాక్

ముఖ్యాంశాలు

  • బాలీవుడ్, టీవీ స్టార్ కుషాల్ పంజాబీ ఆత్మహత్య
  • ముంబైలోని తన అపార్ట్ మెంట్ లో ఉరేసుకుని ఆత్మహత్య
  • అవకాశాలు లేకపోవడం వల్ల తీవ్రస్థాయి మనస్థాపం
  • భార్యతో విభేదాలు, విడాకులు, దూరమైన భార్య, కొడుకు
  • ఫ్రెంచ్ వనితను పెళ్లి చేసుకున్న కుషాల్, గోవాలో వివాహం
  • స్పర్థర కారణంగా ఎడబాటు, షాంఘైకి వెళ్లిన కుషాల్ భార్య
  • తల్లితోనే ఉంటున్న కుషాల్ తనయుడు కియాన్
  • ఈ మధ్యే కొడుకు దగ్గర గడిపి వచ్చిన కుషాల్
  • తిరిగి వచ్చిన తర్వాత ఒత్తిడిన భరించలేక ఆత్మహత్య
  • కుషాల్ ఆత్మహత్యతో షాకైన హిందీ సినిమా, టీవీ ఇండస్ట్రీలు

మంచి స్నేహితుడు. మంచి తండ్రి. కొడుకంటే ప్రాణం. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. అన్నింటినీ చిరునవ్వుతో ఎదిరించి నిలిచి విజయం సాధించాడు. అయినా తనలో ఏదో అసంతృప్తి. ఎక్కడో ఏదో మిస్సవుతున్నానన్న బలీయమైన భావన. జీవితంలో పోరాడీ పోరాడీ అలసిపోయాడు. క్షణకాలం మనసుకు ముసిరిన దౌర్బల్యానికి లోబడి చేజేతులా తన ప్రాణాలను ఉరితాడుకు వేలాడదీశాడు తన ఫ్లాట్ లోనే. కుషాల్ పంజాబీ అర్థంతర మరణం మొత్తం ఇండస్ట్రీకే ఒక షాక్.

కుషాల్ పంజాబీ తన స్నేహితులందరికీ ఓ ఫైటర్ గానే తెలుసు. జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా సరే నిబ్బరంగా నిలబడే మనస్తత్త్వం అతనిది. తన వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కున్నాడు తను నిజంగానే. ఎప్పటికప్పుడు తన మనసుకు సర్ది చెప్పుకుని మొదటినుంచీ మళ్లీ మొదలుపెట్టి సక్సెస్ సాధించిన సందర్భాలూ అనేక విషయాల్లో ఎన్నో ఉన్నాయి. కుషాల్ అసలు ఆత్మహత్య చేసుకోవాలనుకునేంతటి బలహీనమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ఇప్పటికీ అర్థం కావట్లేదని అతని స్నేహితులు కంటతడి పెడుతున్నారు.

చేతన్ హంస్ రాజ్ కుషాల్ కి డియరెస్ట్ ఫ్రెండ్. హంస్ రాజ్ ని అడిగితే కుషాల్ పంజాబీ అంతటి బలహీనమైన నిర్ణయం తీసుకోవడం వెనక అతని జీవితంలో ఉన్న ఎన్నో బలహీనమైన క్షణాలు, భయాలు వెలుగులోకి వచ్చాయి. ఉన్నట్టుండి ఉన్నపళంగా ఉపాధి కరువయ్యింది. తారాపథంలో అగ్రతారగా నిలవాలన్న తన కలకు బ్రేక్ పడింది. అసలు కనీసం పొట్టపోసుకోవడానికైనా కనీసం అవకాశాలు వస్తాయో రావో అని భయపడిపోయాడు. అర్థాంగితో విభేదాలు. తను విడిచిపెట్టి వెళ్లిపోయింది.

భార్యా భర్తలకు విభేదాలొచ్చాయి

ఔడ్రే డోలెన్ ని పెళ్లి చేసుకున్నాడు కుషాల్. ఆమె ఫ్రెంచ్ జాతీయురాలు. నవంబర్ 2015లో వాళ్ల పెళ్లి గోవాలో జరిగింది. వాళ్లకు ముద్దులు మూటగట్టే మూడేళ్ల పిల్లాడు కియాన్ ఉన్నాడు. తర్వాత భార్యాభర్తలకు విభేదాలొచ్చాయి. కొడుకు కియాన్ ని తీసుకుని ఔడ్రే షాంఘైకి వెళ్లిపోయింది. కొద్ది నెలలక్రితమే వాళ్లిద్దరికీ విడాకులుకూడా అయ్యాయి.

అవకాశాలు రానేరావన్న భావననుంచి బయటపడమని, జీవితం చాలా విలువైనదనీ, అదృష్టం కచ్చితంగా ఇంకా ఎన్నో అవకాశాలు ఇచ్చి తీరుతుందనీ, అనుకోకుండా వచ్చి తలుపు తడుతుందనీ, అప్పటివరకూ ఎవరైనా సరే ఓపికగా ఎదురుచూడాల్సిందేననీ చేతన్ కుషాల్ కి ఎన్నో విధాలుగా నచ్చజెప్పి చూశాడు. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోని టాప్ స్టార్స్ ఎవరూ లేరని, అందరూ జీవితంలో ఎత్తుపల్లాల్ని చూసినవాళ్లేననీ మనసుకు హత్తుకునే రీతిలో చెప్పి చూశాడు. తన మాటలు కుషాల్ కి అత్మ విశ్వాసాన్ని కలిగించాయన్న భ్రమలో ఉండిపోయాడు చేతన్. కానీ విధి మరోలా తలచింది. కుషాల్ అత్మహత్యకు పాల్పడతాడని తను ఏమాత్రం ఊహించలేకపోయానంటున్నాడు చేతన్.

ఈ మధ్యే కొంతకాలంపాటు కుషాల్ తన కొడుకు దగ్గర ఉండొచ్చాడు. తిరిగొచ్చిన తర్వాత తన ప్రవర్తన కాస్త వింతగానే కనిపించింది స్నేహితులందరికీ. రెండు రోజుల క్రితం కలుద్దామని చేతన్ కి మెసేజ్ కూడా పంపించాడు. ఓ రోజు క్రితం అతని తల్లిదండ్రులు కుషాల్ కి ఫోన్ చేస్తే పలకలేదు. వాళ్లు భయపడి చేతన్ కి ఫోన్ చేసి కాస్త ఇంటికెళ్లి చూసిరమ్మన్నారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. చేతన్ ఇంటికి వెళ్లి చూసేసరికే కుషాల్ విగతజీవుడై కనిపించాడు.

కుషాల్ బలవన్మరణం ఇండస్ట్రీకి పెద్ద షాక్

కుషాల్ ఇక లేడన్న నిజాన్ని చేతన్ సహా ఇండస్ట్రీలో ఎవరూ నమ్మలేకపోతున్నారు. కుషాల్ బలవన్మరణం ఇండస్ట్రీకి పెద్ద షాక్. మనసులో ఎంత బాధఉన్నాసరే, దాన్ని దాచిపెట్టుకుని బైటికి అందరితోనూ కలివిడిగా కనిపించే కుషాల్, నవ్వుతూ తుళ్లుతూ అందర్నీ కలుపుకుపోయే తత్త్వం ఉన్న కుషాల్, జీవితాన్ని సమర్థంగా నిలబడి సాధించాలన్న పట్టుదల కలిగిన కుషాల్ ఉన్నట్టుండి ఇలాంటి బలహీనమైన నిర్ణయం తీసుకుంటాడని ఎవరూ అనుకోనేలేదు. కానీ అలా జరిగిపోయింది.

1995లో ఎ మౌత్ ఫుల్ ఆప్ స్కై అనే టీవీ టాక్ షోతో కుషాల్ తన కెరీర్ ని ప్రారంభించాడు. 2004లో లక్ష్య, 2005లో కాల్, 2007లో సల్మాన్ – ఎ- ఇష్క్ : ఎ ట్రిబ్యూట్ టూ లవ్, ధన్ ధనాధన్ గోల్ సినిమాలు చేశాడు. ఈ మధ్యకాలంలో తిరిగి టెలివిజన్ కి వెనక్కి వెళ్లాడు. జిందగీ విన్స్, క్యా హాల్ మిస్టర్ పాంచాల్, సాజన్ రే ఫిర్ సే ఝూట్ మత్ బోలో లాంటి షోలతో మళ్లీ టీవీ రంగంలో పాపులర్ అయ్యాడు.

2018 మొదట్లో “గుడ్డన్ : తుమ్ సే న హో పాయేగా”లో తెరమీద కనిపించాడు. “ఇష్క్ మే మర్ జావా” చేసిన సీన్ కుషాల్ వెండి తెర జీవితంలో ఆఖరి సీన్. కుషాల్ కి చాలా దగ్గరైన తారలు శిల్ప సక్లానీ, అపూర్వ అగ్నిహోత్రి కుషాల్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తను విని తీవ్ర స్థాయిలో షాక్ తిన్నారు.

ఒకరోజు ముందుకూడా ముంబైలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే ప్లాన్ గురించి కుషాల్ తో మాట్లాడానని శిల్ప చెబుతోంది. నిజంగా కుషాల్ తమకు రియల్ లైఫ్ లో కూడా హీరోలాగే కనిపించేవాడనీ, అతని వ్యక్తిత్త్వం అంత ఉన్నతమైనదనీ, ఓ పది మందిని వరసగా నిలబెట్టి వీళ్లలో ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాళ్లు ఎవరు అని ఎవరైనా అడిగితే ఎట్టి పరిస్థితిలోనూ ఆ జాబితాలో కుషాల్ పేరు ఉండదనీ, అసలు ఇలా ఎందుకు జరిగిందోకూడా అర్థం కావట్లేదనీ శిల్ప అంటోంది.

వ్యక్తిగత జీవితమలోని ఒత్తిడి వల్లే

కుషాల్ ఇలాంటి పిరికి నిర్ణయం తీసుకోకుండా ఉండి ఉంటే 2020లో అతనికి ఇంకా చాలా మంచి అవకాశాలు కచ్చితంగా వచ్చేవంటుంది శిల్ప. కేవలం వృత్తిపరమైన ఒడిదొడుకులవల్ల తను చేజేతులా ప్రాణం తీసుకుని ఉంటాడని తనూ, అపూర్వా ఏమాత్రం అనుకోవట్లేదని, కేవలం వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒత్తిడులవల్లే కుషాల్ అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటాడనీ చెబుతోంది.

తన భార్య ఔడ్రేతో కలిసి కొడుకు కియాన్ కోసం బంగారు భవిష్యత్తును నిర్మించేందుకు కుషాల్ ఎన్నో కలలు కన్నాడని చెబుతోంది శిల్ప. తను ఎంత బలమైన ఆలోచన కలిగినవాడైనా, పర్సనల్ మాటర్స్ పూర్తాగ అతన్ని కుంగదీసి ఉండొచ్చని అభిప్రాయపడుతోందీ నాయిక.

ర్యాప్ స్టార్ బాబా సైగల్ కుషాల్ తో రెండు టీవీ షోల్లో కలసి పనిచేశాడు. చాలా ఏళ్లుగా వీళ్లిద్దరికీ మంచి పరిచయం ఉంది. గడచిన కొన్ని నెలలుగా తను కుషాల్ తో మాట్లాడడం కుదరలేదని, కనీసం అలా మాట్లాడగలిగినా ఇలాంటి పరిస్థితి తప్పి ఉండేదేమో అని బాగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. స్నేహితులను తరచూ కలుస్తూ ఉంటే ఏవైనా బాధలు, కష్టాలు ఉన్నా మనసు నిబ్బరంగా ఉంటుందనీ, అందుకే ముఖ్యంగా ఇండస్ట్రీలో మంచి స్నేహాలు చాలా అవసరమనీ బాబా అభిప్రాయపడుతున్నాడు.

కుషాల్ కి మరో బెస్ట్ ఫ్రెండ్ యాక్టర్ కరన్ వీర్ వొహ్రా. తనకు కుషాల్ పదహారేళ్లుగా తెలుసట. తను మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేమనిషని చెబుతున్నాడు. కుషాల్ తనకు యాక్టర్ గా మాత్రమే కాక, డాన్సర్ గా, డైరెక్టర్ గా, రైటర్ గా కూడా తెలుసని, తనలో చాలా స్కిల్స్ ఉన్నాయనీ, కేవలం నటించడానికి వీలుకాకపోవడం వల్ల ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదనీ, తను ఏ రంగాన్ని ఎంచుకున్నా చాలా తేలికగా రాణించగలిగేవాడని కరన్ అంటున్నాడు.

కుషాల్ ఎట్టి పరిస్థితుల్లోనూ వృత్తి పరమైన అంశాల గురించి అంతగా కలతచెంది ఉండడనీ, కేవలం వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులవల్లే తనలాంటి దారుణమైన నిర్ణయం తీసుకుని ఉంటాడనీ నటీమణి నారాయణి శాస్త్రి అంటోంది. తను ఈ మధ్యే రైటింగ్, డైరెక్షన్ రంగాల్లోకూడా తన ప్రతిభను ప్రదర్శించడం మొదలుపెట్టాడని చెబుతోంది. పరిస్థితిని జడ్జ్ చేయడం చాలా కష్టం కనుక ఇంతకు మించి చెప్పడానికి తన దగ్గర ఏమీ లేదంటోందీ నటి.

మరో మిత్రుడు నటుడు కరన్ పటేల్ “సంతోషంగా కనిపించే ముఖాల వెనక దాగిఉన్న అనంతమైన బాధల అగాధాలు “ అనే పేరుతో సోషల్ మీడియాలో మనసులను కదిలించే రీతిలో కుషాల్ ఉదంతం గురించి ఒక విశ్లేషణాత్మక వ్యాసం రాశాడు. కుషాల్ మొహంలో ఏ రోజూ బాధ అన్న పదానికి చిరునామా కనిపించేది కాదనీ, మనసులో ఎన్ని బాధలున్నా నవ్వుతూ తుళ్లుతూనే, గంభీరంగానే కనిపించేవాడనీ కరన్ కుషాల్ తో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటున్నాడు.

Next Story