బడ్జెట్ లోనే ఫ్యాషన్లు సృష్టిస్తున్న స్టైల్ పండిట్

By రాణి  Published on  29 Jan 2020 5:32 PM IST
బడ్జెట్ లోనే ఫ్యాషన్లు సృష్టిస్తున్న స్టైల్ పండిట్

ముఖ్యాంశాలు

  • తెలుగు సినిమా స్టార్లను స్టైలిష్ స్టార్లుగా మారుస్తున్న మేఘన
  • ఫ్యాషన్ డిజైనర్ గా, స్టైల్ మేకర్ గా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు
  • మేఘన డిజైన్లకోసం అర్రులు చాస్తున్న ఫేమస్ స్టార్స్
  • ముఖ్యంగా హీరోయిన్ల సంగతైతే చెప్పాల్సిన పనేలేదు
  • కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను సినిమాతో అరంగేట్రం
  • వరసగా 7 హిట్ సినిమాలతో దుమ్ము దులిపేసిన మేఘన
  • ప్రతి సినిమాలోనూ సరికొత్త వైవిధ్యాన్ని ప్రదర్శించిన మేఘన

మేఘన అల్లూరి. హైదరాబాదీ సెలబ్రిటీ స్టైలిస్ట్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ కొత్త ట్రెండ్ ని సృష్టించిన ఫ్యాషన్ డిజైనర్. సెలబ్రిటీలు వేసుకునే దుస్తులకు సంబంధించిన అతి చిన్న విషయాల్లోకూడా బాగా కేర్ తీసుకునే స్టైలిస్ట్ ఈమె. ఈమధ్య కాలంలో మేఘన డిజైన్ చేసిన దుస్తుల్ని వేసుకున్న టాలీవుడ్ స్టార్స్ స్టైలిష్ స్టార్స్ గా మెరిసిపోవడమే కాక ఫ్యాన్స్ లో విపరీతంగా ఫాలోయింగ్ పెరిగి పోవడాన్నికూడా గమనిస్తున్నారు. ఆ కారణంగా మేఘన డిజైన్ చేసిన ఫ్యాషన్లకు ఇండస్ట్రీలో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. తెర వెనక ఉండి తెరమీద ఉండేవాళ్లని మెరుపులు మెరిపించే అసలైన స్టార్లలో ఫ్యాషన్ డిజైనర్లు, కాస్ట్యూమ్ డిజైనర్లది ప్రధానమైన పాత్ర. ఈమధ్య కాలంలో ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కడంతో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకూడా వీళ్లని కాస్ట్యూమ్ డిజైనర్ అనే పదంతోకాకుండా ఫ్యాషన్ డిజైనర్ అనే పదంతో పిలుస్తున్నారు.

ఫ్యాషన్ డిజైనర్ల నిరంతరాయమైన శ్రమవల్లే స్టార్స్ కి ఎక్కడికెళ్లినా, ఏ సినిమాలో నటించినా రెడ్ కార్పెట్ పరుస్తున్నారు ఫ్యాన్స్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. స్టార్లు స్టైలిష్ స్టార్లుగా మారాలంటే కచ్చితంగా ఫ్యాషన్ డిజైనర్ పాత్ర ఉండి తీరాల్సిందే. అర్జున్ రెడ్డి సినిమానుంచి మేఘన స్టార్ మరీ ఊపందుకుంది. ఆ సినిమాలో ఆమె హీరో హీరోయిన్లకు డిజైన్ చేసిన దుస్తులు కొత్త లుక్ తో, న్యూ ట్రెండ్ తో అతి సహజంగా, వాస్తవానికి దగ్గరగా ఉండడం, పైగా అవి చాలా ఫ్యాషన్ గా ఉండడంకూడా ఆమెకు ఆ క్రేజ్ తెచ్చిపెట్టాయి. శ్రియ చరణ్, క్యాథరిన్ థెరిసా, ప్రదీప్ మంచిరాజు లాంటి బిగ్ స్టార్లకు ఫ్యాషన్ డిజైన్ చేసిన ఈ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ మేఘన పేరు ఇప్పుడు మొత్తం దక్షిణాది అంతా పాకిపోయింది. పాతికేళ్ల ఈ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ మొదట్నుంచీ ఫ్యాషన్ డిజైనింగ్ మీద చాలా ఆసక్తిని కనబరిచేది. ఇప్పుడది ఆమె కెరీర్ గా మారిపోయింది.

Style Pundit Believes In Fashion On A Budget

ఛాయ్ బిస్కెట్ తో అరంగేట్రం

సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టేందుకు మాత్రం ఆమె చక్కగా ప్లాన్ చేసుకుని అడుగులు వేసిందనే చెప్పాలి. ఛాయ్ బిస్కెట్ వెబ్ సిరీస్ తో ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది. చదువుకునే రోజుల్లోనే ప్రదీప్ మాచిరాజుతో ఆమె కొంచెం టచ్ లో ఉంటే చెబుతా షోకు పనిచేసింది. తర్వాత అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చి వెల్లువెత్తాయి. చాలా పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలో వచ్చిన జాబ్ ని చాలా తేలిగ్గా వద్దనుకుంది. పూర్తిగా తన దృష్టిని ఫ్యాషన్ డిజైనింగ్ మీదే కేంద్రీకరించింది. తనకు తల్లి ఇచ్చిన సపోర్ట్ ని ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతుంది ఈ నవతరం స్టైలిష్ ఫ్యాషన్ డిజైనర్. కానీ తండ్రికి మాత్రం మేఘన ఈ కెరీర్ ని ఎంపిక చేసుకోవడం మొదట్లో ఏమంత నచ్చలేదట. తర్వాత్తర్వాత ఆయనకూడా తన ఇంట్రెస్ట్ ని గమనించి ప్రోత్సహించారట. ఇప్పుడు వాళ్లిద్దరూ తన సక్సెస్ ని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారని చెబుతోందీ అందాల డిజైనర్.

మేఘన స్పెషాలిటీ ఏంటంటే బడ్జెట్ కి అనుగుణంగా డిజైన్ చెయ్యడం. బోలెడన్ని డిజైన్లు కుప్పలుగా పోసుకుని రోజుకు నాలుగైదు మార్చేసుకుని అందంగా కనిపించడం అనే కాన్సెప్ట్ కి మేఘన విరుద్ధం. ఉన్న బడ్జెట్ లోనే కొన్ని బట్టల్ని డిజైన్ చేసుకుని అద్భుతంగా కనిపించడంలోనే అసలు సత్తా దాగి ఉందని ఈ స్టైలిష్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ బలంగా నమ్ముతుంది. అదే ఆమె సక్సెస్ కి, ప్రత్యేకతకు కారణమయ్యింది. వరసగా ఏడు సినిమాల్లో దుమ్ము దులిపేసి పాత డిజైన్లను పక్కకి నెట్టేసి, కొత్త ఒరవడికి నాందీ పలికింది.

నలుగురితోపాటు నారాయణ అనడం మేఘనకు చిన్నప్పట్నుంచీ ఇష్టంలేని పని. ఏ పని చేసినా దానిలో ఆమెకు ప్రత్యేకత కనిపించాలి. ఏ స్టెప్ తీసుకున్నా అందులో ఆమె వైవిధ్యం స్పష్టంగా కనిపించాలి. కొన్నిసార్లు కేవలం సరదా కోసం వెరైటీగా ఆలోచిస్తుంది. కొన్నిసార్లు సీరియెస్ గా తీసుకుని మరీ ఏ పనైనా, ఏ డిజైన్ అయినా వాటి పని ఇట్టేపట్టేస్తుంది. చివరికి చేసే ఏ పనిలో అయినా, ఏ డిజైన్ లో అయినా తన మార్క్ మాత్రం స్పష్టంగా కనిపించాలని కోరుకుంటుంది. ఆ తపనే ఇప్పుడు ఇండస్ట్రీకి, స్టార్లకు తెగ నచ్చేస్తోంది.

Next Story