రోజుకి 24 మంది విద్యార్థుల ఆత్మహత్యలు

By Newsmeter.Network  Published on  12 Jan 2020 3:04 AM GMT
రోజుకి 24 మంది విద్యార్థుల ఆత్మహత్యలు

ఇష్టం లేని కోర్సుల్లో బలవంతంగా చేర్చడం, అనుకున్న మార్కులు రాకపోవడం, ర్యాంకుల్లో వెనకబడటం, కాలేజీల్లో ఒత్తిడి, మానసికంగా కుంగిపోవడం .... ఇవన్నీ విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నాయి. విద్యారంగంలో ఒత్తిడుల వల్ల ఒక్క 2018లోనే దాదాపు 10 వేల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు తెలియచేస్తున్నాయి. గత పదేళ్లలో ఇంత మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఇదే మొదటి సారని గణాంకాలు చెబుతున్నాయి.

గత పదేళ్లలో దాదాపు 82,000 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఒక్క 2018 లోనే ప్రతి రోజూ 28 మంది విద్యార్థుల చొప్పున దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థులపై ఒత్తిడి నానాటికీ పెరుగుతోందని, అందుకే ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య పెరుగుతూనే ఉందని గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఎక్కువ మంది పరీక్షల్లో సరిగ్గా మార్కులు రానందున కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుంగుబాటు, మానసిక భయాందోళనలు, మానసిక ఆరోగ్య సమస్యల వల్ల కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. సమాజంలో పెరుగతున్న పోటీతత్వం, విద్యాభ్యాసంలో ఎదురవుతున్న కొత్త సవాళ్లు విద్యార్థులను మానసికంగా దెబ్బతీస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. కుటుంబ వ్యవస్థ బలహీనపడటం, మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు కనీసం మాట సాయం చేసేవారు లేకపోవడం, విద్యార్థుల్లో ఒంటరితనం పెరగడం వంటి కారణాల వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రవృత్తి బాగా పెరుగుతోందని వారంటున్నారు.

2018 లో మొత్తం 1.3 లక్షల ఆత్మహత్యలు దేశంలో నమోదయ్యాయి. వీరిలో విద్యార్థులు 8 శాతం ఉండగా, వ్యవసాయరంగానికి చెందిన వారు మరో 8 శాతం ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో దాదాపు పదిశాతం మంది నిరుద్యోగులేనని గణాంకాలు చెబుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల్లో అత్యధికులు మహారాష్ట్రలో ఉన్నారు. ఆ రాష్ట్రంలో 1,448 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తమిళనాడు రెండో స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 953 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 862 ఆత్మహత్యలతో మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. కర్నాటక, పశ్చిమ బెంగాల్ లు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ అయిదు రాష్ట్రాలలోనే మొత్తం విద్యార్థి ఆత్మహత్యల్లో 45 శాతం ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఎన్ సీ ఆర్ బీ గణాంకాలు చెబుతున్నాయి.

Next Story