కుమారుడికి జరిమానా విధించిన తండ్రి
By తోట వంశీ కుమార్ Published on 12 Aug 2020 7:28 AM GMTఇంగ్లాండ్ పేసర్‌కు స్టువర్ట్ బ్రాడ్‌కు జరిమానా పడింది. ఇటీవల పాకిస్థాన్‌తో ముగిసిన తొలి టెస్టులో బ్రాడ్ ఐసీసీ నిమమావళిని ఉల్లంఘించడంతో.. మ్యాచ్ రిఫరీ మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించారు. జరిమానాతోనే సరిపెట్టకుండా ఒక డీ మెరిట్ పాయింట్‌ను అతని ఖాతాలో వేశాడు. ఆ మ్యాచ్ రిఫరీ ఎవరో కాదు బ్రాడ్ తండ్రి అయిన క్రిస్ బ్రాడ్ .
పాక్ రెండో ఇన్నింగ్స్ 46వ ఓవర్‌లో స్పిన్నర్ యాసిర్ షాను స్టువర్ట్ బ్రాడ్ ఔట్ చేశాడు. యాసిర్ షా పెవిలియన్‌కు వెలుతున్న క్రమంలో యాసిర్ షాను ఉద్దేశించి స్టువర్ట్ బ్రాడ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో మైదానంలో స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై అన్‌పీల్డ్ అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన మ్యాచ్ రిఫరీ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.5ను బ్రాడ్ ఉల్లంఘించినట్లు తేల్చారు. ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.5 ప్రకారం... బ్యాట్స్‌మన్ అవుటైనప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లు అతడిపై దూషణకు దిగడం, ఎగతాళి చేయడం వంటి వాటిని నేరంగా పరిగణిస్తారు. చేసిన తప్పును బ్రాడ్ అంగీకరించాడని అతడి తండ్రి క్రిస్ వెల్లడించారు. గత 24నెలల కాలంలో బ్రాడ్ ఇలా చేయడం ఇది మూడోసారి.
నిబంధనల ప్రకారం రెండేళ్ల వ్యవధిలో ఓ ఆటగాడి ఖాతాలో నాలుగు డీమెరిట్ పాయింట్లు ఉంటే.. అతడిపై ఓ టెస్టు లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల నిషేధం విధిస్తారు. బ్రాడ్ ఖాతాలో 3 డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి. ఇంకో డీమెరిట్‌పాయింట్ గనుక బ్రాడ్ ఖాతాలో చేరితే.. అతడిపై ఓ టెస్టు మ్యాచ్ నిషేదం విధిస్తారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు గురువారం సౌతాంప్టన్ వేదికగా ప్రారంభం కానుంది.